జిల్లాలో హ్యుమన్ ఇమ్మ్యూనోడెఫిషీయెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మేజర్ అయిన ఇద్దరు ఆడ,మగ పరస్పర అంగీకారంతో దాంపత్య జీవితం గడపొచ్చనే కోర్టుతీర్పుల ఫలితంగా హెచ్‌ఐవీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మహమ్మారి బారిన పతున్నారు. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయాలని భావించి ప్రభుత్వం నేటినుంచి రెండు నెలలపాటు అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
మెదక్‌జోన్: జిల్లాలో కొంతకాలంగా ఈ వ్యాధి పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది జిల్లాలో 4,931 మంది హెచ్‌ఐశీ పేషంట్లు ఉండగా, ఈ ఏడాది ఆసంఖ్య 5,402కు చేరుకుంది. అంటే ఏడాదిలో 471 మంది అదనంగా దీని బారిన పడ్డారు. ఇది కేవలం అధికారిక రికార్డుల్లో ఉన్న లెక్కలు మాత్రమే. మరో వెయ్యికి పైగా అనధికారికంగా ఈ వ్యాధి బారిన పడ్డవారు ఉండొచ్చని అంచనా. ఎందుకంటే నిరుపేదలు మాత్రమే సర్కార్ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. కాస్త ఆర్థికంగా ఉన్న వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే పరీక్షలు చేయించుకుంటారు. కనుక అలాంటి వారి సంఖ్య బహిర్గతం కావటం సాధ్యం కాదని అధికారులే చెబుతున్నారు.
విస్తృత అవగాహనలు
ఈ ప్రాణాంతక హెచ్‌ఐవీ పెరుగుతుండటంతో ప్రభుత్వం దీన్ని అరికట్టేందుకు బుధవారం నుంచి రెండు నెలల పాటు విస్తృత అవగాహన కలి్పంచనుంది. ఈ వ్యాధి జిల్లాలోని 34 గ్రామాల్లో మరీ అధికంగా ఉందని భావించిన అధికారులు ఆ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహనకల్పించనున్నారు. కాగా పాజిటివ్(రోగుల) పేర్లను బయట పెట్టకూడదనే ఉద్దేశ్యంతో ఆ గ్రామాల్లో ప్రతీ ఇంటికి వెళ్లి హెచ్‌ఐవీ, ఎయిడ్స్ గురించి వివరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
విద్యార్థులతో...!
ఈ వ్యాధిని నియంత్రించాలంటే ముందుగా విద్యార్థుల నుంచి ప్రారంభించాలని అధికారులు భావించారు. 8వ తరగతి చదువుతున్న కౌమారదశ కలిగిన వారి నుంచి మొదలుకుని హైసూ్కల్స్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు దీనిపై వివరించి వారితో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలను పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు.
ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి
హెచ్‌ఐవీ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ మహమ్మారి గురించి ప్రజలను చైతన్యం చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, రెండుమాసాల పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. ముఖ్యంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తాం. ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
–గణేశ్వర్, డీఎంహెచ్‌ఓ, మెదక్
వ్యాధిసోకే విధానం...!
హెచ్‌ఐవీ రక్షణలేని లైంగిక సంబంధం ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. ఇది సోకితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? హెచ్‌ఐవీ ఉన్న తల్లి నుంచి బిడ్డకు గర్భధారణ ప్రసవం, లేదా పాలిచ్చే సమయంలో వ్యాధి సోకుతుంది. నిర్ధారణకోసం ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి? వ్యాధి సోకిన వారిని ఎలా చూడాలి? ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలతోపాటు మందుల వినియోగం తదితర విషయాలను ప్రజలకు ఈ అవగాహన కార్యక్రమంలో క్షుణంగా వివరించనుంది.


