సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. గతంలో యూనివర్సిటీ విద్యార్థులకు గంజాయి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పెడ్లర్‌ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
కాగా, వర్సిటీలో విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై నిఘా పెట్టిన ఈగల్ టీమ్.. పెడ్లర్ కదలికలపై సమాచారం సేకరించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని విచారించి గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? HCUలో ఎవరెవరికి సరఫరా చేశాడు? అతడి వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
యూనివర్సిటీ పరిసరాల్లో మాదకద్రవ్యాల సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగం, సరఫరాను అరికట్టేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్న ఈగల్ టీమ్.. ఈ కేసులో మరికొందరిని కూడా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


