బీహార్‌లో మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌ను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఆ పార్టీకి మరో టెన్షన్ మొదలుపెట్టారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే 10 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానంటూ ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. “మీ పిల్లల సీవీలు, బయోడేటాలు పంపండి.. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తా” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు.. ఓవైపు యువతలో కొత్త ఆశలు రేపుతుండగా, మరోవైపు బీజేపీకి ఇది కొత్త రాజకీయ సవాలుగా మారే అవకాశముందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతంలో గెలిచి.. అదే నియోజకవర్గంలో ఉద్యోగాలు, అభివృద్ధిని అజెండాగా ముందుకు తీసుకెళ్లడం కమలనాథులకు టెన్షన్ పెంచే అంశంగా మారింది.
బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన ప్రశాంత్ కిషోర్.. ఆగస్టు 3న జరిగిన ఉపఎన్నికలో తనపై నమ్మకం ఉంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జన సురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో అనూహ్య విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. ఈ ఫలితంతో బంకీపూర్‌లో బీజేపీకి ఉన్న దాదాపు 30 ఏళ్ల ఆధిపత్యానికి బ్రేక్ పడింది.
బయోడేటా పంపండి..
విజయం తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్.. తాను ప్రజలకు దూరంగా ఉన్నానంటూ వస్తున్న విమర్శలకు కూడా సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు, ఆరు రోజులుగా నియోజకవర్గంలో కనిపించలేదని కొందరు విమర్శిస్తున్నారని, కానీ తాను ఎక్కడికీ వెళ్లడం లేదని చెప్పారు. “నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మీ కోసం పనిచేస్తున్నాను” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. బంకీపూర్‌లో చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేని యువత కుటుంబాలు తమ పిల్లల CVలు, బయోడేటాలను తన కార్యాలయానికి పంపాలని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు, వ్యక్తులతో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి అర్హత ఉన్న యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభించేలా ప్రయత్నిస్తానని తెలిపారు.
జనసూరజ్ ఎజెండా..
అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాత్రం తాను హామీ ఇవ్వలేనని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం కొంతమంది యువత ప్రారంభంలో బీహార్ వెలుపలికి వెళ్లాల్సి రావచ్చని కూడా చెప్పారు. అయినప్పటికీ వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో కనీసం 10 వేల కుటుంబాల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడం తన లక్ష్యమని ప్రకటించారు. ఇది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన హామీగా కాకుండా.. భవిష్యత్తులో బీహార్‌లో జన సురాజ్ పార్టీ రాజకీయ అజెండాకు సంకేతంగా కూడా కనిపిస్తోంది. జన సురాజ్ పార్టీ బీహార్‌లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనే తగినన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించి.. యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని కిషోర్ చెప్పారు.
బంకీపూర్ అభివృద్ధిపై కూడా ఆయన గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన నియోజకవర్గం ఒక్క రాత్రిలో బెంగళూరుగా మారిపోదని, అయితే రెండు మూడు నెలల్లోనే కనిపించే మార్పులు మొదలవుతాయని చెప్పారు. ఉద్యోగాలతో పాటు విద్య, నెలకు రూ.1,100 పెన్షన్, ఆహార ధాన్యాల పంపిణీ వంటి అంశాలను కూడా నియోజకవర్గంలోని తన ప్రాధాన్యతలుగా పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అందరి చూపూ 10 వేల ఉద్యోగాల హామీపైనే ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఉద్యోగాల నియామక హామీ కాదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన వ్యక్తిగత, రాజకీయ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తానన్న హామీ. అందుకే ఆయన కార్యాలయానికి ఎన్ని సీవీలు వస్తాయి? వాటిలో ఎంతమందికి నిజంగా ఉద్యోగాలు దక్కుతాయి? అన్నదే కీలకం.


