ఎన్‌ఎస్‌ఏ ధోవల్ అండర్ కవర్ ఏజెంట్‌నంటూ దందా
ఖరీదైన టెస్లా కారు.. పలు గుర్తింపు కార్డులు స్వా«దీనం
రూ.100 కోట్ల మేర ఆస్తులు పోగేసినట్లు అంచనా
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారినని, జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)తరఫున అండర్ కవర్ ఏజెంట్‌నని చెప్పుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు వాడుతున్న అత్యంత అధునాతన టెస్లా కారు, ఇతర ఖరీదైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. ఖగారియా జిల్లా గోగ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్‌పూర్‌లో ఉంటున్న మనీష్ గుప్తాగా గుర్తించారు. అతడి ఇంట్లో తనిఖీలు జరిపారు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉన్న టెస్లా కారును స్వా«దీనం చేసుకున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ కలిగిన ఇటువంటి కార్లు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీంతోపాటు, టాటా సఫారీ కారును, భారీగా విదేశీ మద్యం, ఐదు యాపిల్ ఫోన్లు, ఇతర ఖరీదైన వస్తువులను సీజ్ చేశారు. విచారణ సందర్భంగా ఇతడు చూపిన ఐఏఎస్ అధికారి గుర్తింపు కార్డు ఫేక్ అని ఖగారియా ఎస్‌పీ భానుప్రతాప్ సింగ్ చెప్పారు.
ఎన్‌ఎస్‌ఏ అజిత్ ధోవల్ అండర్ కవర్ ఏజెంట్‌గా చెప్పుకుంటూ ఇతడు చూపుతున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కార్డు కూడా నకిలీదేనన్నారు. ఈ కార్డులతో ఇతడు ఖగారియాతోపాటు బిహార్ వ్యాప్తంగా మోసాలు, బెదిరింపులు, వసూళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇతడి ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిని ఇతడు ఎలా సంపాదించిందీ తెలుసుకునేందుకు వివిధ విభాగాల సహకారం తీసుకుంటామని ఎస్‌పీ వివరించారు.
పారిన్ మద్యం.. జింక కొమ్ములు
గుప్తా నివాసంలో జరిపిన సోదాల్లో అధికారులు కళ్లు చెదిరే స్థాయిలో ఖరీదైన వస్తువులు, మద్యం ఉండటం చూసి కంగుతిన్నారు. దిగుమతి చేసుకున్న విదేశీ మద్యం 31 లీటర్లకుపైగా ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు ఐదు ఐఫోన్లు, 23 క్రెడిట్ కార్డులు, 8 డెబిట్ కార్డులు, నాలుగు చెక్ బుక్కులను గుర్తించారు. తనిఖీల్లో ఇంట్లో రెండు జింక కొమ్ములు కూడా బయటపడ్డాయి. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం వీటిని కలిగి ఉండటం నేరం. పలు అటవీ సంరక్షణకు సంబంధించిన ట్రోఫీలను కూడా స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి నివాసం వద్ద అమర్చిన 11 సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులోని ఫుటేజీని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.


