breaking news
Jan Suraaj Party (JSP)
-
బిహార్ ఫలితాలపై పీకే సంచలన వ్యాఖ్యలు..
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. అయితే, రిగ్గింగ్‌కు సంబంధించిన ఆధారాలు లేవని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.బిహార్ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ మౌనం వీడారు. తాజాగా ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఓటమి చాలా బాధిస్తోంది. ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు నాకు సరిపోలడం లేదు. ప్రాథమికంగా, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది. రిగ్గింగ్ జరిగినట్టు అర్థమవుతోంది. అయితే, దానికి సంబంధించిన ఆధారాలు ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఓడిపోయిన తర్వాత అందరూ ఇలాగే మాట్లాడతారు అని అనుకోవచ్చు. ఎప్పటికైనా ఆధారాలు బయటకు వస్తాయి. జన్ సురాజ్ యాత్రలో మా టీమ్ సేకరించిన అభిప్రాయంతో ఓటింగ్ సరిపోలడం లేదు. ఏదో తప్పు జరిగిందని నాకు తెలుస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి బిహార్‌లోని వేలాది మంది మహిళా ఓటర్లకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బిహార్‌లో 50వేల మంది మహిళలకు 10వేలు ఇవ్వడం కూడా ఫలితాలపై ప్రభావం చూపించిందన్నారు. అలాగే, ఎన్నికల ప్రచారం చివరి నాటికి మా పార్టీ గెలిచే స్థితిలో లేదనే కారణంగా కొందరు ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో లాలూ జంగిల్ రాజ్ సర్కార్ రావద్దనే కారణంతో ఎన్డీయేకు మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చారు.ఇక, బిహార్ ఎన్నికల్లో 243 సీట్లలో 238 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ.. పెద్దగా విజయం సాధించలేదు. ఒక్క నియోజకవర్గాన్ని కూడా గెలుచుకోలేదు. కేవలం 2 నుండి 3 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకుంది. ఆయన పార్టీ అభ్యర్థులలో ఎక్కువ మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు.#Exclusive | Jan Suraaj Party chief @PrashantKishor hints at EVM manipulation, says "...wo dikh raha hai kuch toh hua hai. Kya hua hain wo hume pata nahi hai, lekin ye add nahi ho raha." #PrashantKishor #BiharElections2025 @PreetiChoudhry pic.twitter.com/656AuWTGTx— IndiaToday (@IndiaToday) November 23, 2025 -
నితీష్ ప్రమాణం వేళ.. ‘పీకే’ మౌనవ్రతం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవసారి ప్రమాణ స్వీకారం చేసి, రికార్డు సృష్టించిన వేళ.. రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) ఒక రోజుపాటు ‘మౌన వ్రతం’ పాటిస్తున్నారు. ఆయన ఈరోజు పశ్చిమ చంపారన్‌లోని భితిహర్వా గాంధీ ఆశ్రమంలో ఈ దీక్షను చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విఫలం కావడానికి తానే పూర్లి బాధ్యత వహిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.ఆయన ఈ మౌనవ్రతానికి ముందు పట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘బీహార్ ప్రజలు దేని ఆధారంగా ఓటు వేయాలి? కొత్త వ్యవస్థను ఎందుకు సృష్టించాలి? అనే దాని గురించి వారికి వివరించడంలో విఫలమయ్యాను. ఈ వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగానే మౌనవ్రతం చేస్తున్నాను. ఎన్నికల రాజకీయాలలో తమ తొలి అరంగేట్రం నిరాశపరిచినప్పటికీ, బిహార్‌ను మెరుగుపరచాలనే తన సంకల్పాన్ని నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని’ అన్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 85 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ భారీ విజయంతో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం పట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. 2005, 2010, 2015లో కూడా నితీష్ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు.ఇది కూడా చదవండి: బిహార్ సీఎంగా నితీష్.. మంత్రులుగా 26 మంది ప్రమాణం -
‘చనిపోలేదు.. ఇప్పుడే పుట్టింది’.. ‘జన్ సురాజ్’పై పోస్ట్‌మార్టం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్డీఏ ప్రభుత్వం మరోమారు కొలువుదీరబోతోంది. అయితే ఇంతలో ఈ ఎన్నికల్లో పరాజయం పాలైన పార్టీలు తమను తాము విశ్లేషించుకోవడం మొదలుపెట్టాయి. ఈ కోవలోనిదే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్’.గణాంకాలతో సమాధానంబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినప్పటికీ ‘జన్ సురాజ్’ తన రాజకీయ పయనానికి శుభారంభం పలికిందని ‘ఇండియా టుడే’ తన విశ్లేషణలో పేర్కొంది. అత్యంత క్లిష్టమైన బిహార్ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఈ పార్టీ చనిపోయిందంటూ అంటున్నవారికి, ఎన్నికల గణాంకాలు గట్టి సమాధానం ఇస్తున్నాయని వివరించింది. సున్నా సీట్లు గెలుచుకున్నప్పటికీ, పార్టీ సాధించిన బలమైన 3.4% ఓట్ల వాటాను విశ్లేషకులు ఒక ముఖ్యమైన పునాదిగా చూస్తున్నారు. ఇది బీహార్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న బీఎస్పీ, ఏఐఎంఐఎం, మరో మూడు వామపక్ష పార్టీల సంయుక్త ఓట్ల వాటా కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలు సంప్రదాయ రాజకీయాలను ధిక్కరిస్తూ, ప్రజా సమస్యలపై ప్రచారం చేసిన ప్రశాంత్ కిషోర్ ప్రయత్నానికి కనీస ఆమోదం లభించిందని స్పష్టం చేస్తున్నాయి.‘కాంస్య పతక విజేత’గా..జన్ సురాజ్ అరంగేట్రాన్ని లోతుగా పరిశీలిస్తే, పార్టీ ప్రభావం కేవలం ఓట్ల వాటాకే పరిమితం కాలేదని తెలుస్తోంది. పార్టీ పోటీ చేసిన 238 స్థానాల్లో దాదాపు 54% అంటే 129 నియోజకవర్గాల్లో ఇది మూడవ స్థానంలో నిలిచి ‘కాంస్య పతక విజేత’గా అవతరించింది. సరన్ జిల్లాలోని మార్హౌరా అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి 58,190 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. సగటున ప్రతి సీటుకు 7,000 కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. అయితే 238 మంది అభ్యర్థులలో 236 మంది డిపాజిట్లు కోల్పోయారనేది నిజమే అయినా, చన్పాటియా, సహర్సా తదితర 33 నియోజకవర్గాల్లో ‘జన్ సురాజ్’ ఓట్ల సంఖ్య ఎన్డీఏ లేదా మహాఘట్బంధన్ గెలుపు ఆధిక్యాన్ని మించిపోయి, ఫలితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందనడంలో సందేహం లేదని ‘ఇండియా టుడే’ పేర్కొంది.ఆదర్శవాద రాజకీయం..మరోవైపు ప్రశాంత్ కిషోర్ అనుసరించిన ఆదర్శవాద రాజకీయ విధానం సీట్ల రూపంలోకి మారకపోయినా, ఈ అంశాలు ప్రజలకు చేరాయి. రాష్టంలోని నిరుద్యోగం, వలసలు, విద్య, ఆరోగ్యం తదితర సమస్యలపై ప్రశాంత్ కిశోర్ దృష్టి సారించారు. అంతేకాకుండా నేర చరిత్ర లేని అధికారులు, విద్యావేత్తలు, వైద్యులు, సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టిన ఏకైక పార్టీగా ‘జన్ సురాజ్’ నిలిచింది. కులం, మతం తదితర అంశాల అధారంగా ఓటింగ్ జరిగే రాష్ట్రంలో కొత్త పార్టీ తన మొదటి ప్రయత్నంలో విజయాన్ని సాధించలేకపోయింది.వెబ్సైట్లో దక్కిని స్థానం?అయితే ఎన్నికల సంఘం (ఈసీఐ)వెబ్సైట్లో జన్ సురాజ్ సాధించిన 3.4% ఓట్ల వాటాను ప్రత్యేకంగా చూపించకపోవడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 0.3% ఓట్లు సాధించిన పార్టీల పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ, జన్ సురాజ్ మాత్రం ‘ఇతరులు’ వర్గంలోకి నెట్టివేయడం ఆశ్చర్యం కలిగించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చర్య సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. జన్ సురాజ్ పార్టీ మొత్తం 16.77 లక్షలకు పైగా ఓట్లను సాధించింది. ఇది బీహార్‌లోని ఓటర్లలో గణనీయమైన సంఖ్య.రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపుఈ ఎన్నికల అగ్నిపరీక్ష ‘జన్ సురాజ్’ రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసింది. పాదయాత్రలు, వివిధ సమస్యాత్మక అంశాల ఆధారిత ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించడంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. సంప్రదాయ రాజకీయ శక్తుల ఓటు బ్యాంకును చీల్చగల సామర్థ్యాన్ని పార్టీ ప్రదర్శించింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ చూపిన తొలి ప్రదర్శన.. భవిష్యత్తులో బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల శక్తిగా అవతరించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ యూటర్న్.. ఎప్స్టీన్ ఫైల్స్‌పై కొత్త ప్రకటన -
ప్రజాధనం దుర్వినియోగం
పట్నా: ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకువశ్నిచ్చిన రూ.14 వేల కోట్లను బిహార్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడానికి బదులుగా సీఎం నితీశ్ ప్రభుత్వం దారి మళ్లించిందని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఆ డబ్బును అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేసి, వారిని మశ్నిచ్చిక చేసుకునేందుకు వాడుకుందని విమర్శించారు. ఇది కశ్నిచ్చితంగా ప్రజాధనాన్ని దురి్వనియోగం చేయడమేనన్నారు. ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాల్పడిన అనైతిక చర్యగా ఆయన అభివరి్ణంచారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడం తెల్సిందే. ఈ ఫలితాలను ప్రభావితం చేసిన అంశాల్లో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయడం కీలకంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ‘ఎన్నికల ఫలితాలను కొనుగోలు చేశారు. జూన్ 21వ తేదీ నుంచి పోలింగ్ జరిగే వరకు అధికారపక్షం ఏకంగా రూ.40 వేల కోట్లను ఖర్చుపెట్టింది. ప్రజాధనాన్ని ప్రజల ఓట్లను కొనేందుకు వాడుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి కేవలం గంట ముందుగా మహిళల బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేసింది. ఇందుకు ప్రపంచబ్యాంకు నిధులను వాడినట్లు మాకు తెల్సింది’అని జన్‌సురాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ తెలిపారు. ఖజానా ఉన్న డబ్బంతా ఎన్నికల్లో గెలవడానికే నితీశ్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు మిగిలింది ఖాళీ ఖజానాయేనని ఆ పార్టీ ప్రతినిధి పవన్ వర్మ తెలిపారు. రాష్ట్రం మొత్తం అప్పు రూ.4.06 లక్షల కోట్లకు చేరుకోగా రోజుకు రూ.63 కోట్ల చొప్పున వడ్డీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు. -
జంగిల్‌రాజ్ భయంతో మా ఓటర్లు ఎన్డీయేకి ఓటేశారు: ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ఎన్డీయే గెలుపుపై తనదైన విశ్లేషణ చేశారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్ బంధన్ అధికారంలోకి వచ్చిన పక్షంలో జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందనే భయంతో తమ పార్టీ ఓటర్లు కొందరు ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు ఓటు వేశారని వివరించారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో సీమాంచల్ ప్రాంతంలోని ఓట్లన్నీ ఒకే పక్షానికి గంపగుత్తగా పడ్డాయని ఆ పార్టీ నేత ఉదయ్ సింగ్ చెప్పారు. వీరిద్దరూ శనివారం పట్నాలో మీడియాతో మాట్లాడారు. జంగిల్ రాజ్ ఉందని తాను చెప్పలేనన్న ప్రశాంత్ కిశోర్..తమ పార్టీ ఓటర్లు మాత్రం ఆ భయం వల్లే ఎన్డీయేకు ఓటేశార న్నారు. కాంగ్రెస్‌తోగానీ, మహాగఠ్ బంధన్‌లోని ఏ ఇతర పార్టీతోనూ లేని ఇబ్బంది ఆర్జేడీతో ఉన్నట్లుగా ప్రజలు భావించారని తెలిపారు. ముస్లిం వర్గం తమను ఇంకా పూర్తిగా నమ్మలే దంటూ ఆయన..దీర్ఘకాలంలో వారి మద్దతుల భిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను ఎన్డీయే ప్రభుత్వం వెదజల్లిందన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తెచ్చిన రూ.14 వేల కోట్లను సైతం ఉచితాల మళ్లించారని ఆరోపించారు. -
Bihar: గుండెపోటుతో ‘జన్ సురాజ్’ అభ్యర్థి మృతి
పట్నా: బిహార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజునే జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ)కి చెందిన అభ్యర్థి చంద్ర శేఖర్ సింగ్ గుండెపోటుతో మృతి చెందడం ఆ పార్టీకి తీరని లోటుగా మారింది.. తరారి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సింగ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.కుర్మురి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడైన చంద్ర శేఖర్ సింగ్, రాజకీయ నేపథ్యం లేకపోయినా సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నాయి. దీంతో ఆయన ప్రశాంత్ కిషోర్ స్ఫూర్తితో జన్ సురాజ్ పార్టీలో చేరి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. అయితే ప్రచారంలో ఉన్నప్పుడే ఆయనకు మొదటిసారి అక్టోబర్ 31న గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఎన్నికల ఫలితాల రోజున ఆయనకు రెండవసారి వచ్చిన గుండెపోటు ప్రాణాంతకమైంది. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం ఆయన తరారి నియోజకవర్గంలో 2,271 ఓట్లను సాధించారు. ఈ స్థానంలో బీజేపీకి చెందిన విశాల్ ప్రశాంత్ విజయం సాధించారు. సింగ్ మరణ వార్తతో ఆయన స్వగ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సూరజ్ పార్టీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 'గేమ్-ఛేంజర్'గా ప్రవేశించినప్పటికీ, 243 స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ పార్టీ ఇతర పార్టీల కంటే అత్యధికంగా 238 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రాష్ట్రంలోని నిరుద్యోగం, వలసలు, పారిశ్రామిక అభివృద్ధి లేమి తదితర కీలక అంశాలపై ప్రచారం నిర్వహించినా, అది ఓటర్లలో ప్రభావం చూపలేకపోయింది. పలువురు జేఎస్పీ అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయారు.ఇది కూడా చదవండి: ‘పొత్తు వద్దంటే చిత్తే’.. ‘ఇండియా కూటమికి’ మజ్లిస్ షాక్ -
అందర్నీ గెలిపించి.. స్వరాష్ట్రంలో చతికిలపడి..
పట్నా: ఢిల్లీ, ప శ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలను సునాయాసంగా గెలుపుబాటలో నడిపించి అధికార పీఠాలపై కూర్చోబెట్టిన ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ తీరా స్వరాష్ట్రం బిహార్‌లో సొంతంగా పార్టీ పెట్టి కూడా కనీసం ఒక్క స్థానంలో గెలవలేక ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఇలాంటి ఫలితాలను ముందే ఊహించిన ప్రశాంత్ ఇటీవల ఈ అంశంపై మాట్లాడటం విశేషం. ‘‘గెలిస్తే మహా ప్రభంజనం సృష్టిస్తాం. ఎవ్వరూ ఊహించనన్ని సీట్లు గెల్చుకుంటా. లేదంటే అత్యంత ఘోరంగా ఓడిపోతాం’’అని అన్నారు. రెండో మాట అచ్చంగా శుక్రవారం నిజమైంది. ఆయన స్థాపించిన జన సురాజ్ పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీచేసి కనీసం ఒక్కచోట కూడా గెలుపుబోణీ కొట్టలేకపోయింది. చాలా చోట్ల పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. పాదయాత్రతో మొదలెట్టి.. 2022 అక్టోబర్ రెండో తేదీన చంపారన్‌లో ప్రశాంత్ పాదయాత్ర మొదలెట్టి వందల కిలోమీటర్లు నడిచారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. సమస్యలను తీర్చుతానని హామీ ఇచ్చారు. ఛాయ్ పే చర్చా అంటూ ప్రధాని మోదీకి కొత్త నినాదం ఇచి్చన ప్రశాంత్ తదనంతర కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, ప శ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, బిహార్‌లో నితీశ్ కుమార్, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉండి ఆయా రాష్ట్రాల్లో వాళ్ల పార్టీలను గెలిపించారు. అదే వ్యూహంతో బిహార్‌లోనూ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ అనూహ్యంగా చతికిలపడ్డారు. శుక్రవారం విడుదలైన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో జన సురాజ్‌పార్టీ అభ్యర్థులు అందరూ ఓడిపోయారు. ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. నితీశ్‌తో పొసగక సొంత పార్టీ.. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ–ప్యాక్) పేరిట ఎన్నికల వ్యూహాలు, సిద్ధాంతాలు, పథకాలను రచించే సంస్థను కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ స్థాపించారు. ఇతర రాష్ట్రాల్లో వ్యూహకర్తగా విజయం సాధించాక స్వరాష్ట్రంలో అడుగుపెట్టారు. 2015లో నితీశ్‌కుమార్‌ను గెలిపించి నితీశ్ సర్కార్‌లో కేబినెట్ మంత్రి హోదాకు సమానంగా ప్రభుత్వసలహాదారు పదవిలో ప్రశాంత్ కొనసాగారు. మూడేళ్ల తర్వాత జేడీయూలో చేరి ఏకంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అయితే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో నితీశ్, ప్రశాంత్ మధ్య తీవ్రవిభేదాలు పొడచూపాయి. దీంతో ప్రశాంత్‌ను జేడీయూ నుంచి బహిష్కరించారు. ఈ అక్కసుతోనే సొంత పార్టీ పెట్టాడని బిహారీలు ఇంకా నమ్ముతున్నారు. పేలవ కేడర్, కొత్త అభ్యర్థులు ఎలాంటి నేరచరిత్రలేని అభ్యర్థులను రంగంలోకి దింపానని ప్రశాంత్ ఘనంగా ప్రకటించారు. కానీ ఏ రాష్ట్రంలోనైనా కాస్తంత ఛరిష్మా ఉన్న నేతలే ఎక్కువ ఓట్లను కొల్లగొట్టగలరని రాజకీయ చరిత్ర చెబుతోంది. కొన్ని నెలల క్రితమే స్థాపించిన జన సురాజ్ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోకి చొచ్చుకుపోలేదు. దీంతో పార్టీకి పెద్దగా కేడర్, కార్యకర్తల బలం లేదు. ఇవన్నీ పార్టీ విజయావకాశాలను బాగా దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిహార్‌లో మార్పు తెస్తానని వాగ్దానంతో ఎన్నికల పద్మవ్యూహంలో దిగిన ప్రశాంత్ తొలి ప్రయత్నంలో జనం చావుదెబ్బ తీశారు. -
మహా కూటమికి ఘోర పరాభవం!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ప్రస్తుతం 190 ఫ్లస్ లీడ్‌తో హిస్టారికల్ విక్టరీ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ట్రెండ్స్ ప్రకారం.. మహాఘట్ బంధన్ ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది. మరోవైపు.. అయితే ఘనవిజయం లేదంటే ఘోర పరాజయం అంచనా వేసిన ఎన్నికల మాజీ వ్యూహకర్త, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ జోస్యం మాత్రం నిజం కాబోతోంది. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్‌కు ఇది తొలి ఎన్నికలు. అయితే ఆశించిన విజయాన్ని అందుకోకున్నా.. ఈ పార్టీ ఎక్స్ఫ్యాక్టర్గా పని చేయొచ్చని విశ్లేషకులు భావించారు. ఎగ్జిట్‌పోల్స్ మాత్రం జేఎస్పీ ఘోరంగా విఫలమవుతుందని, ఒక్క సీటు మాత్రమే గెలిచే అవకాశం అంతంత మాత్రంగా ఉందని అంచనా వేశాయి. కానీ, ఆ అంచనా కూడా తప్పేలా కనిపిస్తోంది.ఇవాళ్టి బిహార్ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్, ఆపై ఈవీఎం కౌంటింగ్‌లోనూ రెండు నుంచి 4 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. ఆ తర్వాత నెమ్మదిగా సున్నాకే పరిమితమైంది. ఇప్పుడు ఒక్క స్థానం దక్కించుకోవడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. చివర్లో ఎలాంటి ఫలితం దక్కించుకుంటోందో చూడాలి. ఎన్నికల వ్యూహకర్తగా నితీశ్ కుమార్ సహా పలువురి విజయాల్లో పీకే కీలక పాత్ర పోషించారు. అయితే.. సొంత పార్టీతో మూడేళ్లుగా చేస్తున్న ప్రచారం మాత్రం వర్కవుట్ కాలేదనే స్పష్టం చేస్తోంది.ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీహార్ ఎన్నికల్లో జేడీయూ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా నితీశ్ పని అయిపోయిందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి ఈ ఫలితం పుల్‌స్టాప్ వేసిందని భావించొచ్చు. ఇక అధికార మిత్రపక్షం బీజేపీ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. తుది ఫలితాలు వెల్లడయ్యేలోపు ఈ లెక్క కొంచెం మారే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్జేడీ(75), బీజేపీ(74), జేడీయూ(43), కాంగ్రెస్(19).. ఇలా ప్రధాన పార్టీలు సీట్లు దక్కించుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీయే హవా చూస్తుంటే ఆర్జేడీ+కాంగ్రెస్+ఇతర పార్టీల కూటమి సగానికి పైగా స్థానాలను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడో విచిత్రం ఏంటంటే.. 200 స్థానాల్లో పీకే జేఎస్పీ డిపాజిట్లు కొల్పోయింది. విపక్ష కాంగ్రెస్ కంటే.. పీకే జేఎస్పీ ఓటు శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు(అంచనా మాత్రమే). మొత్తంగా ప్రశాంత్ కిషోర్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ.. మహాఘట్ బంధన్ ఓట్లను చీల్చడం ద్వారా NDAకి లాభం చేకూర్చిందనే చర్చ మొదలైందక్కడ. -
Bihar Elections: ప్రశాంత్ కిశోర్ ‘జీరో’?.. కారణాలివే?
న్యూఢిల్లీ/పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చేదు అనుభవం ఎదురుకానున్నదని ఎగ్టిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇప్పటివరకు ప్రధానంగా తొమ్మిది ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వాటిలోని దైనిక్ భాస్కర్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్సైట్, పీపుల్స్ పల్స్, జేవీసీ, పీ-మార్క్, చాణక్య స్ట్రాటజీస్, డీవి రీసెర్చ్, టీఐఎఫ్ రీసెర్చ్‌లు.. పాలక ఎన్డీఏకి స్పష్టమైన విజయాన్ని, ప్రతిపక్ష మహాకూటమికి ఓటమిని చూపాయి. రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం అయిన ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ‘జన్ సురాజ్’కు షాక్‌నకు గురిచేసే ఫలితాలను అంచనావేశాయి.బీహార్‌లోని 243 నియోజకవర్గాలలో ‘జన్ సురాజ్’పోటీ చేసినప్పటికీ, ఆ పార్టీ ఖాతా తెరవడంలో విఫలం కావచ్చని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ 0-5 పరిధిని అంచనా వేయగా, దైనిక్ భాస్కర్ 0-3, పీపుల్స్ ఇన్సైట్ 0-2, మ్యాట్రిజ్ 0-2, జేవీసీ 0-1 మధ్య ‘జన్ సురాజ్’కు సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. కాగా బీహార్‌లో రెండు దశల పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతాలు నమోదయ్యాయి. ఇది అధికార వ్యతిరేకతకు సూచన అంటూ మహాకూటమి, జన్ సూరాజ్లు ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్, నిపుణుల అంచనా అందుకు భిన్నంగా ఉంది.జన్ సురాజ్ పార్టీ స్వల్ప ఓట్ల శాతాన్ని గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఈ ఓట్ల వాటాలో ఎక్కువ శాతం మహాకూటమి నుంచి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఎన్డీఏ వ్యతిరేక ఓట్లు ‘జన్ సురాజ్’కు పడే అవకాశాలు చాలా తక్కువేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీహార్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తక్కువగానే ఉందని, అది మహాకూటమి, ప్రశాంత్ కిషోర్ పార్టీ మధ్య చీలిపోయి, ప్రతిపక్షాలను దెబ్బతీసిందని నిపుణులు అంటున్నారు. అలాగే ప్రశాంత్ కిశోర్ పార్టీ సంవత్సరం క్రితమే వచ్చిందని, అది నిలదొక్కుకునేందుకు చాలా కాలం పడుతుందని చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘భయంతో పేల్చేశారా?’.. నిఘా వర్గాలు -
Bihar Elections: ‘బాహుబలి’ నేత అరెస్ట్.. మోకామాలో కలకలకం
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మోకామా నియోజకవర్గంలో కలకలం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, బాహుబలి నేతగా పేరొందిన అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జన్ సురాజ్ పార్టీ కార్యకర్త, ఆర్జేడీ మాజీ నేత దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ను బార్హ్‌లోని అతని నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టును పట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) కార్తికేయ శర్మ, పట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ ఎస్ఎమ్ మీడియా ముందు ధృవీకరించారు. అనంత్ సింగ్‌తో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజీత్ రాహలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.అసలేం జరిగింది?గ్యాంగ్‌స్టర్ నుండి రాజకీయ నేతగా మారిన దులార్ చంద్ యాదవ్, గురువారం నాడు మోకామాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న తన మేనల్లుడు ప్రియదర్శి పియూష్ తరపున యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత హత్యకు గురికావడం మోకామాలో ఉద్రిక్తతకు దారితీసింది.పోస్ట్‌మార్టం నివేదికపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దులార్ చంద్ యాదవ్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. యాదవ్ మరణానికి కారణం అతని గుండె, ఊపిరితిత్తులకు గట్టి గాయాలు కావడం. ఫలితంగా కార్డియో-శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది. పోస్ట్‌మార్టం నివేదిక, ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఇది హత్య అని స్పష్టంగా తెలుస్తున్నదని ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.అనంత్ సింగ్.. రాజకీయ వివాదాలుఅనంత్ సింగ్ బీహార్ రాజకీయాల్లో ‘బాహుబలి’నేతగా పేరొందారు. గతంలో ఆర్జేడీతో సంబంధాలు ఉన్న సింగ్, అనేక నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ తరపున మోకామా నుండి గెలిచినప్పటికీ, ఆయుధాల అక్రమ నిల్వ కేసులో దోషిగా తేలడంతో 2022లో ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన భార్య నీలం దేవి మోకామా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంత్ సింగ్ అరెస్టు రాబోయే బీహార్ ఎన్నికల పైన, ముఖ్యంగా మోకామాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అది అసాధ్యం’.. ఖర్గేకు అమిత్‌షా కౌంటర్ -
Bihar Election: ఎన్డీఏ, మహాకూటమిపై పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్‌లో ఎన్నికల వేడి నెలకొంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయ సందడి చేస్తున్నాయి. తాజాగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్(పీకే) ఎన్డీఏ, మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, తమ ‘జన్ సురాజ్’ పార్టీల మధ్యనే ఉంటుందని, మహాకూటమి ఓటమిపాలై, మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త, జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్(మహాకూటమి) రాబోయే ఎన్నికల్లో ఓటమిపాలై మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. తాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో మహాకూటమి మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, జన్ సురాజ్ మధ్యనే ఉంటుందన్నారు. గత ఐదు రోజుల్లో తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనల్లో అస్సలు అర్థం లేదని, వీటిపై ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు.దీనికి ముందు మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ బీహార్ ఓటర్లు నితీష్ కుమార్, బీజేపీ, లాలు యాదవ్‌ల ఆధిపత్య పార్టీల రాజకీయాలను దాటి వెళుతున్నారని అన్నారు. రాష్ట్ర యువతపై తటస్థ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నదన్నారు. బీహార్‌లో కొత్త రాజకీయ చరిత్రను అంతా చూస్తారని.. లాలు, నితీష్,బీజేపీలకు భయపడి ఓటు వేసిన 30 ఏళ్ల యుగం ముగియబోతున్నదన్నారు. కొత్త ప్రత్యామ్నాయం ఉద్భవిస్తోందని, దాని నేత.. ఏ నాయకుడు, కుటుంబం లేదా కులానికి చెందినవాడు కాదని, బీహార్‌కు చెందినవాడేనని అన్నారు. జన్ సురాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, జీవనోపాధి కోసం ఎవరూ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని కిషోర్ పేర్కొన్నారు. #WATCH | Purnea, Bihar | On #BiharAssemblyElections, Jan Suraaj founder Prashant Kishor says, "We are visiting every assembly constituency. Mahagathbandhan is in the third position. The fight is between NDA and Jan Suraaj. The announcements made by Tejashwi Yadav in the last 5… pic.twitter.com/9I3DWgpzfU— ANI (@ANI) October 27, 2025 -
బీహార్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల్లో(bihar Assembly Election) బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(prashant Kishor) ఆరోపించారు. మంగళవారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. దానాపూర్, బ్రహాంపూర్, గోపాల్‌గంజ్ సీట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతోనే ఎన్డీయే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు.ఈ సందర్బంగా ప్రశాంత్ కిషోర్.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు తగు భద్రత కల్పించాలి’ అని ఆయన కోరారు. ఆదివారం వరకు పార్టీ తరఫున చురుగ్గా పనిచేసిన బ్రహాంపూర్‌లో తమ అభ్యర్థి సత్యప్రకాశ్ తివారీ సోమవారం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ(BJP Party) ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం తివారీ ఇంటికి వెళ్లి తీవ్రంగా బెదిరించారన్నారు.బీజేపీ నేతలు బెదిరింపుల వల్లే పోటీ నుంచి వైదొలగుతున్నట్లు గోపాల్‌గంజ్‌లోని తమ అభ్యర్థి శేఖర్ సిన్హా, దాన్‌పూర్‌లో అభ్యర్థి అఖిలేశ్ షా తనకు చెప్పారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ప్రజల్లో సడలుతున్న విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలన్నారు. అభ్యర్థులనే కాపాడలేని ఈసీ, ఓటర్లకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన ప్రశాంత్ కిశోర్ బీజేపీ నేతలపై ఆరోపణల ద్వారా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. -
ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(prashant kishor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారాయన. తాజాగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. అందులోనూ ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బరిలో నిల్చోవడం లేదంటూ స్పష్టత ఇచ్చారాయన. పోటీకి బదులు తనను సంస్థాగత పనులపై దృష్టిసారించాలని పార్టీ నిర్ణయించింది అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఒకవేళ తాను ఎన్నికల్లో గనుక పోటీ చేస్తే తన స్వస్థలం కర్గాహర్ లేదంటే రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు. రాఘోపూర్ ఆర్జేడీ కంచుకోట. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్.. హ్యాట్రిక్‌పై కన్నేశారు. అయితే.. జన్ సురాజ్ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. కానీ, జన్ సురాజ్ రెండో జాబితాలో రాఘోపూర్ నుంచి చంచల్ సింగ్ పేరును ప్రకటించారు. దీంతో ఆ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. అయితే పోటీ చేయకున్నా పార్టీని బలోపేతం చేయడానికి.. ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తాను కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారాయన. జేడీయూకి ఎలాంటి ఓటమి దక్కబోతోందో చెప్పడానికి సెఫాలజిస్ట్( ఎన్నికల విశ్లేషకుడు) అయి ఉండాల్సిన అవసరమేమీ లేదని అన్నారాయన. అలాగే జన్ సురాజ్‌పార్టీ లక్ష్యం భారీదని, 150 స్థానాలకు ఒక్క సీటు తగ్గినా తమ పార్టీ ఓడిపోయినట్లేనని పీకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రాహుల్ లాగే తేజస్వీకి ఓటమి తప్పదు
రాయపూర్: ఆరేళ్ల క్రితం అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడినట్లుగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు పరాజయం తప్పదని జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. వైశాలి జిల్లా రఘోపూర్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తేజస్వీ ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేయవచ్చని పుకార్లు వస్తున్నాయని విలేకరులు అడగ్గా.., ప్రశాంత్ కిషోర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘మా పార్టీ ఇక్కడ బలమైన అభ్యర్థిని పోటీకి దింపుతుందనే ఊహాగానాలకే తేజస్వీ భయపడుతున్నారు. వారిని రెండు చోట్ల పోటీ చేయనీయండి. 2019లో రాహుల్ గాంధీ కూడా వయనాడ్, అమేథీలో పోటీ చేశారు. కాంగ్రెస్‌కు 15 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీ, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అవమానకర రీతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆర్జేడీకి, తేజస్వీ యాదవ్‌కు కూడా అదే గతి పడుతుంది’’ అన్నారు. రఘోపూర్ నియోజకవర్గంలో తేజ్వసీ కుటుంబం దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించారు. అయినప్పట్టకీ ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వారసత్వ పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ సింగ్ శత్రువు కాదుభోజ్పురి సూపర్‌స్టార్ పవన్ తనకు శత్రువు కాదన్నారు. ఆయన వ్యక్తిగతంగా మిత్రుడేనని, బీజేపీలో ఉన్నారనేదానిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పవన్ సింగ్ భార్య తన అభద్రతా భావాలను పంచుకోవడానికి వచ్చినప్పుడు, తాను ఒక సోదరుడిలా హామీ ఇచ్చానన్నారు. తాను కానీ, జన్ సురాజ్ పార్టీ వారి వివాహ వివాదంలో ఎలాంటి జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.ఆశావహుల్లో అసంతృప్తి సహజంరెండురోజుల క్రితం పార్టీ 51 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసిన ఆశావహులను తేలికగా తీసుకున్నారు. ఇది ప్రతిపార్టీలోనూ సహజమని అన్నారు. వేలాది మంది రక్తం, కన్నీళ్లు, చెమటతో జన్ సురాజ్ పార్టీ నిర్మాణం జరిగిందన్నారు. అసెంబ్లీలో కేవలం 243 సీట్లు మాత్రమే ఉన్నప్పుడు వారందరికీ అవకాశం కల్పించడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. తమ పార్టీ అత్యంత పారదర్శక ప్రజాస్వామ్య పార్టీ సిద్ధాంతాలు కలిగి ఉందన్నారు. ప్రతీ సమస్య పరిష్కరిస్తామన్నారు.పోటీపై పార్టీదే తుది నిర్ణయంజన్ సురాజ్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆదివారం(ఇవాళ) జరుగుతుందన్నారు. రఘోపుర్ నుంచి తనకు వచ్చే అభిప్రాయం కూడా చర్చకు వస్తుందన్నారు. దాని ఆధారంగా, అత్యంత అనుకూలమైన అభ్యర్థిని నిర్ణయిస్తారని, అది తానేనేనా అని చెప్పలేనని అన్నారు. ఆ నిర్ణయం పార్టీ తీసుకోవాలని చెప్పారు. -
డెబ్యూతోనే పెద్ద రిస్క్!! పీకే ఏమన్నారంటే..
అదేదో సినిమాలో.. ఏమాత్రం రాజకీయానుభవం లేనివాళ్లను ఎన్నికల్లో నిలబెట్టి గెలిచి.. చివరకు తాను కాకుండా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని సీఎం చేస్తాడు క్లైమాక్స్‌లో హీరో. బీహార్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఈ సీన్‌ను ప్రస్తావిస్తున్నారు పలువురు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త(మాజీ).. తన పార్టీ జన్ సురాజ్ తరఫున అభ్యర్థుల ప్రకటనే ఇందుకు ప్రధాన కారణం. ప్రశాంత్ కిషోర్(prashant kishor).. బీహార్ ఎన్నికల బరిలో తొలిసారి తన జన సురాజ్ పార్టీని ఒంటరిగా పోటీకి నిలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం 51 మందితో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేశారాయన. అందులో.. ప్రముఖ మ్యాథ్స్ ప్రొఫెసర్ కేసీ సిన్హా(పాట్నా వర్సిటీ మాజీ వీసీ), మాజీ అడ్వొకేట్ జనరల్ వైబీ గిరి, రితేష్ రంజన్ పాండే (బోజ్‌పురి గాయకుడు)తో పాటు డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులు సైతం ఉన్నారు. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే..గోపాల్‌గంజ్ భోరే నియోజక వర్గంలో జన్ సురాజ్(Jan Suraaj Party) తరఫున పోటీ చేయబోతున్న ప్రీతి కిన్నర్(Preeti Kinnar).. ఈ జాబితాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే.. ఆమె ఓ ట్రాన్స్‌జెండర్ కాబట్టి. ప్రీతి కిన్నర్.. స్వస్థలం కల్యాణ్‌పూర్. ట్రాన్స్జెండర్ల నాయకురాలిగా.. సామాజిక వేత్తగా స్థానికంగా ఆమెకు మంచి పేరుంది. ఇంతకీ ఆమె పోటీ చేయబోతోంది ఎవరి మీదనో తెలుసా?.. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సునీల్ కుమార్ మీద. అందుకే ఆమె గురించి ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. అయితే.. స్థానిక సమస్యలపై ఆమెకు అవగాహన ఉండడం కలిసొచ్చే అంశమని జన్ సురాజ్ భావిస్తోంది.గెలిచిన దాఖలాల్లేవ్!రాజకీయాల్లో ట్రాన్స్జెండర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు అత్యంత అరుదనే చెప్పాలి. 1998 మధ్యప్రదేశ్ ఎలక్షన్స్‌లో శబ్నం మౌసీ సోహగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. 2015లో మధు కిన్నర్ చత్తీస్‌గఢ్ రాయ్‌ఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నెగ్గి.. మేయర్ పదవి చేపట్టారు కూడా. అయితే.. ఆ తర్వాతే ఆ వర్గం నుంచి చెప్పుకోదగ్గ విజయాలేవీ నమోదు కాలేదు.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి రాజన్ సింగ్ పోటీ చేసి.. కేవలం 85 ఓట్లే దక్కించుకున్నారు. ఈ తరుణంలో ప్రీతి కిన్నర్.. అదీ జన్ సురాజ్ నుంచి బీహార్ ఎన్నికల బరిలో దిగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ప్రీతి కిన్నర్(ఎడమ), ప్రొఫెసర్ కేసీ సిన్హా(మధ్యలో), సింగర్ రితేష్ రంజన్ పాండే(చివర.. కుడి)రిస్క్‌పై పీకే ఏమన్నారంటే.. జన్ సురాజ్ తొలి జాబితాలో.. సామాజిక న్యాయం వరకు అయితే బాగానే జరిగింది. 17 మంది ఈబీసీలు, 11 మంది బీసీలు, 9 మంది మైనారిటీలు, ఏడుగురు షెడ్యూల్ కాస్ట్(ప్రీతి కూడా), ఎనిమిది మంది ఇతర వర్గాల వాళ్లు ఉన్నారు. ‘‘జన సురాజ్ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ఓట్లు పడకపోతే.. అది నా తప్పేం కాదు. అది ముమ్మాటికీ బీహార్ ఓటర్లదే’’ అని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. ‘పార్టీకి సరైన గుర్తింపు లేదు, ప్రచార నిధులు పరిమితంగా ఉన్నాయి. పైగా అవతల జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ లాంటి పార్టీలు ఉండగా.. ఎన్నికల్లో కొత్త ముఖాలతో వెళ్లడం రిస్క్ కాదా?’ అనే మీడియా ప్రశ్నకు ఆయన పైబదులు ఇచ్చారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం నినాదాలతో ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు. అక్టోబర్ 11న, రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పేరు తొలి జాబితాలో లేదు, కానీ రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని పార్టీ తెలిపింది. నవంబర్ 6, 11.. రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections 2025) జరగనున్నాయి. నవంబర్ 14వ తేదీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: మాయావతి ఎంట్రీ.. సీన్ మారేనా? -
Bihar Elections: ‘పీకే’ తొలి జాబితాలో 51 మంది అభ్యర్థులు
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సందిడి నెలకొంది. పార్టీలలో చేరికలు కొనసాగుతున్నాయి. పోటీలో దిగేందుకు పలువురు నేతలు ఉబలాటపడుతున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్(పీకే)కు చెందిన జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. వీరిలో 16 శాతం ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.‘పీకే’ ప్రకటించిన తొలి జాబితాలో మాజీ అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్యులు మొదలైనవారు ఉన్నారు. వచ్చే నెలలో బీహార్‌లో జరగబోయే రెండు దశల ఎన్నికల్లో పోటీచేయబోయే జన్ సురాజ్ అభ్యర్థుల మొదటి జాబితా ఇది. ఈ జాబితాలో 16 శాతం ముస్లిం అభ్యర్థులతో పాటు 17 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారున్నారు. ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతిని ఎత్తిచూపారు. ఈ నేపధ్యంలోనే పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారి క్లీన్ ఇమేజ్ కీలక అంశంగా గుర్తించారు. जन सुराज के उम्मीदवारों की पहली सूची। pic.twitter.com/5VFYHHWm1W— Jan Suraaj (@jansuraajonline) October 9, 2025ఇదిలావుండగా బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ప్రశాంత్ కిశోర్ ఇటీవల స్పష్టం చేశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)తో జతకడతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తమ కూటమి ప్రజలతోనే ఉంటుందని అన్నారు. బీహార్‌ను దోచుకోవడానికే పోరాటం జరుగుతోందని, ఇది సీట్ల కోసం జరుగుతున్న యుద్ధం కాదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై తీవ్ర చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ మధ్య పొత్తు కుదరవచ్చనే ప్రచారం జరిగింది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి 40 సీట్లు కేటాయించాలని కోరుతున్నారని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ తాము గెలిచామని, ఈసారి కూడా తమకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని పాశ్వాన్ డిమాండ్ చేస్తున్నారు. -
బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చిన ఆయన.. నితీశ్ కుమార్‌కు ఇవి ఫేర్వెల్ ఎలక్షన్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో.. తాము అధికారంలోకి వస్తే గనుక అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఓ ప్రకటన చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ‘‘మోదీ, నితీశ్, లాలూ వీళ్ల కోసం ఓట్లు వేయొద్దు. ఈ ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం. వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఒక్కసారి ఆలోచన చేయండి. కొత్త భవిష్యత్తు కోసం ఓటు వేయండి’’ బీహార్ ఓటర్లకు ప్రశాంత్ కిషోర్ పిలుపు ఇచ్చారు.జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party) ఈ ఎన్నికల్లో 48% ఓట్లు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారాయన. ఇది బీహార్‌కు కొత్త అధ్యాయం అని, జన సురాజ్ పార్టీ నేతృత్వంలో తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అవినీతి రాజకీయ నాయకులు, అధికారులపై విచారణ జరిపించి వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అలాగే.. బీహార్‌ను దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని, ఆయన ఇక ముఖ్యమంత్రి పదవిలో ఉండరని, ఈ ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని ప్రశాంత్ కిషోర్ ధీమాగా ప్రకటించారు. బహుశా.. పట్నా మెట్రో ప్రారంభం సీఎంగా నితీశ్ చివరి కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Election 2025) ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయబోతున్నారు. అక్టోబర్ 9వ తేదీన జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారాయన.బీహార్ అసెంబ్లీని రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే మెజారిటీ మార్క్ 122 సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. ప్రస్తుతానికి.. అధికార ఎన్డీయే కూటమికి 131 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి 111 సీట్లు, మిగిలినవి ఇతరులు ఉన్నారు.అధికారంలో కొనసాగాలని ఎన్డీయే కూటమి(జేడీ(యూ)+బీజేపీ), అధికారం చేజిక్కించుకోవాలని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్ష మహాఘట్బంధన్ కూటమి, అవినీతి.. ప్రజా సమస్యలే ప్రదాన అజెండా తొలిసారి పోటీకి దిగుతున్న జన్ సురాజ్‌తో త్రిముఖ పోటీ హోరాహోరీగానే నడవచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయక్కడ. ఇదీ చదవండి: బీహార్ ఎన్నికల్లో.. తొలిసారిగా ఈసీఐ నెట్!


