ముజఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ప్రముఖుల ఏఐ వీడియోల కలకలం చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు సంబంధించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత నకిలీ వీడియోలు, ఆడియోలను సృష్టించిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బోచహా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్‌పూర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ రాజ్‌గా పోలీసులు గుర్తించారు. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించి, అశాంతిని సృష్టించేందుకు నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.
పోలీసుల దర్యాప్తులో నిందితుడు ప్రమోద్ కుమార్ రాజ్‌కు ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ‘జన్ సురాజ్’ పార్టీతో సంబంధం కలిగి ఉన్నట్లు వెల్లడయ్యింది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు తన మొబైల్ ఫోన్ సాయంతో ప్రధాని, రాష్ట్రపతి ఫోటోలు, గొంతులను దుర్వినియోగం చేస్తూ, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. పోలీసులు నిందితుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అతని నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు.
ఈ ఏఐ డీప్‌ఫేక్ కంటెంట్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ప్రజాస్వామ్య సంస్థలపై అపనమ్మకాన్ని కలిగించడం, దేశంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడమేనని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటువంటి నకిలీ వీడియోలు దేశ వ్యతిరేక భావాలను, వదంతులను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: నేడు మరో నూతన సంవత్సరం.. కోలాహలానికి భిన్నంగా..


