విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త
బిహార్ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన ప్రశాంత్ కిషోర్ ‘జన సురాజ్ పార్టీ’
పట్నా: ఢిల్లీ, ప శ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలను సునాయాసంగా గెలుపుబాటలో నడిపించి అధికార పీఠాలపై కూర్చోబెట్టిన ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ తీరా స్వరాష్ట్రం బిహార్‌లో సొంతంగా పార్టీ పెట్టి కూడా కనీసం ఒక్క స్థానంలో గెలవలేక ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఇలాంటి ఫలితాలను ముందే ఊహించిన ప్రశాంత్ ఇటీవల ఈ అంశంపై మాట్లాడటం విశేషం.
‘‘గెలిస్తే మహా ప్రభంజనం సృష్టిస్తాం. ఎవ్వరూ ఊహించనన్ని సీట్లు గెల్చుకుంటా. లేదంటే అత్యంత ఘోరంగా ఓడిపోతాం’’అని అన్నారు. రెండో మాట అచ్చంగా శుక్రవారం నిజమైంది. ఆయన స్థాపించిన జన సురాజ్ పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీచేసి కనీసం ఒక్కచోట కూడా గెలుపుబోణీ కొట్టలేకపోయింది. చాలా చోట్ల పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
పాదయాత్రతో మొదలెట్టి..
2022 అక్టోబర్ రెండో తేదీన చంపారన్‌లో ప్రశాంత్ పాదయాత్ర మొదలెట్టి వందల కిలోమీటర్లు నడిచారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. సమస్యలను తీర్చుతానని హామీ ఇచ్చారు. ఛాయ్ పే చర్చా అంటూ ప్రధాని మోదీకి కొత్త నినాదం ఇచి్చన ప్రశాంత్ తదనంతర కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, ప శ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ పార్టీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, బిహార్‌లో నితీశ్ కుమార్, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉండి ఆయా రాష్ట్రాల్లో వాళ్ల పార్టీలను గెలిపించారు. అదే వ్యూహంతో బిహార్‌లోనూ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ అనూహ్యంగా చతికిలపడ్డారు. శుక్రవారం విడుదలైన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో జన సురాజ్‌పార్టీ అభ్యర్థులు అందరూ ఓడిపోయారు. ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు.
నితీశ్‌తో పొసగక సొంత పార్టీ..
ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ–ప్యాక్) పేరిట ఎన్నికల వ్యూహాలు, సిద్ధాంతాలు, పథకాలను రచించే సంస్థను కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ స్థాపించారు. ఇతర రాష్ట్రాల్లో వ్యూహకర్తగా విజయం సాధించాక స్వరాష్ట్రంలో అడుగుపెట్టారు. 2015లో నితీశ్‌కుమార్‌ను గెలిపించి నితీశ్ సర్కార్‌లో కేబినెట్ మంత్రి హోదాకు సమానంగా ప్రభుత్వసలహాదారు పదవిలో ప్రశాంత్ కొనసాగారు. మూడేళ్ల తర్వాత జేడీయూలో చేరి ఏకంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అయితే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో నితీశ్, ప్రశాంత్ మధ్య తీవ్రవిభేదాలు పొడచూపాయి. దీంతో ప్రశాంత్‌ను జేడీయూ నుంచి బహిష్కరించారు. ఈ అక్కసుతోనే సొంత పార్టీ పెట్టాడని బిహారీలు ఇంకా నమ్ముతున్నారు.
పేలవ కేడర్, కొత్త అభ్యర్థులు
ఎలాంటి నేరచరిత్రలేని అభ్యర్థులను రంగంలోకి దింపానని ప్రశాంత్ ఘనంగా ప్రకటించారు. కానీ ఏ రాష్ట్రంలోనైనా కాస్తంత ఛరిష్మా ఉన్న నేతలే ఎక్కువ ఓట్లను కొల్లగొట్టగలరని రాజకీయ చరిత్ర చెబుతోంది. కొన్ని నెలల క్రితమే స్థాపించిన జన సురాజ్ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోకి చొచ్చుకుపోలేదు. దీంతో పార్టీకి పెద్దగా కేడర్, కార్యకర్తల బలం లేదు. ఇవన్నీ పార్టీ విజయావకాశాలను బాగా దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిహార్‌లో మార్పు తెస్తానని వాగ్దానంతో ఎన్నికల పద్మవ్యూహంలో దిగిన ప్రశాంత్ తొలి ప్రయత్నంలో జనం చావుదెబ్బ తీశారు.


