సాక్షి, విజయవాడ: ప్రజల ఆస్తిని దోచుకోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తామని మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని హితవు పలికారు.
మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘మచిలీపట్నంలో మా పార్టీ ప్లాన్ పెట్టుకుంటే కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అధికారులు పార్టీ టీడీపీ నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కోర్టులు తీర్పునిచ్చినా.. నాకు మంత్రి కొల్లు రవీంద్రే ఎక్కువ అన్నట్లుగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జైలులో వేస్తా జాగ్రత్త అని మండిపడ్డారంటే మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు అర్ధం అవుతుంది.
ఎవరైతే అధికారులు పొగరుగా వ్యవహరిస్తారో వారికి కోర్టు తీర్పు ఒక హెచ్చరిక. ప్రజల పన్నులతో మీరు బ్రతుకుతున్నారు. పాలేరులా పని చేయవద్దు. బ్రిటీష్ వాళ్లకు తొత్తులుగా మారినప్పుడు ఏం చేశారో రేపు ప్రజలే తీసేస్తారు ఇలాంటి వాళ్లని. ప్రజల ఆస్తిని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. నిన్న లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తాననడం సిగ్గుచేటు. జనం ఆస్తి కాబట్టి మదం ఎక్కి మాట్లాడుతున్నారు.. హెరిటేజ్ ఆస్తులను అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తారా?. లోపల ప్రోడక్ట్స్ పావలాకి ఇస్తారా?. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా?. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.

వైఎస్ జగన్ మాటలను అసహ్యంగా వక్రీకరిస్తున్నారు. మీ సొమ్ము కాదు కాబట్టి జనం సొమ్ము కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో కడతారా?. మీ ఆస్తులు ఎక్కడైనా హైవేలపైనే ఎందుకు కడుతున్నారు. రెట్టింపు అయ్యేందుకా?. జనం సొమ్ము నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టి తగలేసే బదులు విజయవాడ గుంటూరు మధ్య కడితే ప్రజలే నిర్మాణం చేసుకుంటారని జగన్ అన్నారు. దానిని కూడా వక్రీకరిస్తున్నారు. అమరావతిలో వర్షాలు రాగానే తుమ్మ చెట్లు తీసేయడం నీటిని తోడే దానికి వందకోట్లు ఖర్చు పెడుతున్నారు. వెయ్యి కోట్లతో మిషన్లు కొంటామంటున్నారు.. మరి దాని కోసం కోట్లు తగలేసే బదులు విజయవాడ గుంటూరు మార్గంలో నిర్మిస్తే బావుంటుందని జగన్ అన్నారు. జగన్ మాట్లాడితే టీడీపీ నేతలు నోరు తెరుస్తారా?. చంద్రబాబు, లోకేష్, మంత్రులు అబద్దాలు మాట్లాడితే నోరు మెదపరా?. ప్రజలే వాతలు పెట్టే రోజు ప్రభుత్వానికి దగ్గరలో ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


