‘రాధిక’కు ఇన్ని రాయితీలా!? | Chandrababu Naidu government is weakening the public sector AP Oilfed | Sakshi
Sakshi News home page

‘రాధిక’కు ఇన్ని రాయితీలా!?

Mar 5 2026 3:09 AM | Updated on Mar 5 2026 3:09 AM

Chandrababu Naidu government is weakening the public sector AP Oilfed

రాధిక వెజిటబుల్‌ ఆయిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.95.98 కోట్ల మేర రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో

విజయనగరంలో ప్రైవేటు ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

బాబు సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌..

రూ. 240 కోట్ల యూనిట్‌కు 95.98 కోట్ల లబ్ధి

ప్రభుత్వానికి వాటా లేదు.. రాబడీ లేదు...

ప్రైవేటు రంగంలోని పరిశ్రమలకు సాధారణంగా 15శాతం లోపే రాయితీలు

రాధిక వెజిటబుల్‌ ఆయిల్స్‌ మాత్రం స్పెషల్‌... 44శాతానికి పైగా రాయితీలు

ప్రభుత్వ రంగంలోని ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్‌

ప్రైవేటు కంపెనీకి దోచిపెడుతూ దోచుకునే స్కెచ్‌

సాక్షి, అమరావతి: దొడ్డిదారిన ప్రజాధనం లూటీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమకు ఆర్థిక చేయూతనివ్వకుండా ప్రైవేటు రంగంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రాయితీల రూపంలో అడ్డగోలుగా లబ్ది చేకూరుస్తోంది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొత్తకి గ్రామం వద్ద రూ.240 కోట్లతో ప్రైవేటు రంగంలో ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు‘రాధిక వెజిటబుల్‌ ఆయిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థకు ప్రభుత్వం ఇస్తోన్న రాయితీలే ఇందుకు నిదర్శనం. 

ఎన్నడూ లేనివిధంగా ప్రాజెక్టు వ్యయంలో 44 శాతానికి పైగా రాయితీలు కల్పిస్తూ  పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో ప్రకారం చూస్తే ఏ స్థాయిలో దోపిడీకి స్కెచ్‌ వేశారో ఇట్టే అర్థమవుతుంది.

ఆయిల్‌ ఫెడ్‌ యూనిట్‌ను నిర్వీర్యం చేస్తూ..
ఆయిల్‌ పామ్‌ రైతులకు ఓఈఆర్‌ (నూనె వెలికితీత నిష్పత్తి) నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ ప్లాంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది మొదలు ఏదో విధంగా మూసివేసి తమ అనుయా­యులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర­లు చేస్తూనే ఉంది. వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.10 కోట్లతో ఆధునికీకరణ పనులు పూర్తిచేసుకుని గంటకు టన్ను సామర్థ్యం కల్గిన ఈ ప్లాంట్‌ నేడు 24 టన్నుల క్రషింగ్‌ చేస్తోంది. 

2018–19లో 90 వేల టన్నులు ప్రాసెస్‌ చేయగా, ప్రస్తుతం 1.20 లక్షల టన్నులు ప్రాసెస్‌ చేసే స్థాయికి చేరింది. దాదాపు రూ.200 కోట్లకు పైగా లాభాల్లో నడుస్తున్న ఈ యూనిట్‌ను ఆధునికీకరణతో పాటు కాకినాడ, ఏలూరుల్లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కొత్త యూనిట్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్‌సీడీసీ, ఎన్‌డీడీబీ ముందుకొచ్చినా, ప్రభుత్వం మాత్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. 

పైగా గతంలో టీడీపీ హయాంలో ఎగ్గొట్టిన రూ.156 కోట్ల బకాయిలను చెల్లిస్తే, పెదవేగి యూనిట్‌ను ఆధునికీకరించుకుంటామని చెప్పినా స్వలాభం కోసం ఆ ప్రతిపాదనను గాలికొదిలేసింది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న యూనిట్లను మూడుకు విస్తరించగా ఏపీలో మాత్రం ఉన్న ఏకైక యూనిట్‌ను మూసివేయాలని కుట్రలు చేయటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 14 ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏకైక యూనిట్‌ను నిర్వీర్యం చేసి ఆయిల్‌ పామ్‌ రంగంలో గుత్తాధిపత్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమే లక్ష్యంగా ప్రైవేటురంగంలో ఈ యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 

రూ.240 కోట్ల ప్రాజెక్టుకు.. రూ.95.98 కోట్ల రాయితీలా?
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు 10–15 శాతానికి మించవు. క్యాపిటల్‌ సబ్సిడీ రూపంలో నేరుగా రూ.42.50 కోట్లు ఉచిత గ్రాంట్‌ రూపంలో ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర జీఎస్‌టీ రీయింబర్సుమెంట్‌ రూపంలో ఐదేళ్ల పాటు 100 శాతం అంటే రూ.31.50 కోట్లు తిరిగి ఇచ్చేయ­నున్నారు. 304 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందున ఉపాధి సబ్సిడీ రూపంలో రూ.13.64 కోట్ల రాయితీ ఇస్తున్నారు. 

అంటే ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం రూ.4.5 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. డీకార్బోనైజేషన్‌ సబ్సిడీ కింద రూ.3 కోట్లు, విద్యుత్‌ రాయితీల రూపంలో రూ.3.74 కోట్లు, స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు రూపంలో రూ.60లక్షల మేర రాయితీలు ఇస్తోంది. ఇలా రాయితీల రూపంలో ప్రాజెక్టు వ్యయంలో 44.02శాతం (రూ.95.98 కోట్లు)మేర లబ్ధి చేకూర్చడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అడ్డగోలు దోపిడీ కోసమే ఈ రాయితీలు..
ఇంత పెద్దఎత్తున రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వానికి ఈ కంపెనీలో వాటా కానీ, లాభాల్లో వాటా కానీ ఏమైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. తెరవెనుక పెద్దలకు ఈ కంపెనీలో వాటాలుండడం వలనే ఈ స్థాయిలో రాయితీలు ఇస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాబడి లేని రాయితీలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఆయిల్‌పామ్‌ రైతులు నిలదీస్తున్నారు.. ఇంత పెద్దఎత్తున రాయితీలివ్వడానికి బదులుæ ప్రభుత్వ యూనిట్‌ను ఆధునికీకరించడం లేదా ప్రభుత్వ రంగంలోనే కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందంటున్నారు. 

పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి కాకుండా.. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిచే, ఎంపిక చేసిన వ్యక్తులు, సంస్థలకు లబ్ధి చేకూర్చడం ద్వారా తమ జేబులు నింపు కోవడమే లక్ష్యంగా ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ 4.0ని రూపొందించినట్టు కన్పిస్తోందంటున్నారు. ఇది ముమ్మాటికి నీకింత..నాకింత తరహా దోపిడీకి తెరతీయడమేనని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయిల్‌ పామ్‌ రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement