ప్రమాద ఘంటిక.. మాయిస్ట్‌ హీట్‌ | Meteorological Department says impact of heatwaves will increase in this summer | Sakshi
Sakshi News home page

ప్రమాద ఘంటిక.. మాయిస్ట్‌ హీట్‌

Mar 5 2026 2:56 AM | Updated on Mar 5 2026 2:56 AM

Meteorological Department says impact of heatwaves will increase in this summer

ఎల్‌నినో, అస్థిరమైన సముద్రపు గాలుల కలయికతో వేడి తేమ తీవ్రత పెరిగే అవకాశం 

ఈ వేసవిలో ఉక్కపోత ప్రభావం మరింత పెరుగుతుందంటున్న వాతావరణ శాఖ 

సాక్షి, అమరావతి: వేసవి అంటే మనకు గుర్తుకు వచ్చేది సెగలు గక్కే ఎండలు, వడగాడ్పులు. కానీ ఈ వేసవి సీజన్‌లో వాతావరణం ఒక కొత్త రూపం దాల్చబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు సాధారణంగానే ఉన్నట్లు అనిపించినా రానున్న రోజుల్లో ‘మాయిస్ట్‌ హీట్‌’ (తేమతో కూడిన వేడి) ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గాలిలో ఉష్ణోగ్రతతో పాటు తేమ కూడా అధికంగా ఉండటాన్ని ‘మాయిస్ట్‌ హీట్‌’ అంటారు. 

సాధారణ పరిభాషలో దీన్ని ఉక్కపోతగా పేర్కొంటారు. సాధారణ ఎండల కంటే ఇది భిన్నమైంది. పొడి ఎండల్లో చెమట పడితే గాలికి ఆవిరై శరీరం చల్లబడుతుంది. కానీ గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాదు. దీనివల్ల శరీరం తనను తాను చల్లబరుచుకునే సహజ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిశోధనల్లో ‘వెట్‌–బల్బ్‌ టెంపరేచర్‌’ అనే పదం ప్రముఖంగా వినిపిస్తోంది. గాలిలోని వేడి, తేమను కలిపి కొలిచే కొలమానాన్నే ఇలా పిలుస్తున్నారు. 

సాధారణంగా వెట్‌–బల్బ్‌ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు దాటితే అది మానవ శరీరానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ ఇది 35 డిగ్రీలకు చేరితే అత్యంత ఆరోగ్యవంతులు కూడా నీడలో ఉన్నా తట్టుకోవడం కష్టమవుతుందని నేచర్‌ క్‌లైమేట్‌ చేంజ్‌ వంటి అంతర్జాతీయ జర్నల్స్‌ పేర్కొన్నాయి. తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. 

మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్‌ వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో గాలి మందగించడం వల్ల తేమ ఒకే చోట పేరుకుపోయి మాయిస్ట్‌ హీట్‌ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వాతావరణ వ్యవస్థలు అస్థిరంగా ఉండడం వల్ల సముద్రపు గాలులు భూభాగంపైకి ఎక్కువ తేమను మోసుకొస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

రెండు మూడేళ్లుగా ఇదే ధోరణి..  
వాస్తవానికి ఈ మార్పు ఇప్పుడు హఠాత్తుగా వచ్చిందేమీ కాదు. గత రెండు, మూడేళ్లుగా ఈ ధోరణి కనిపిస్తోంది. 2024, 2025 వేసవి కాలాల్లో ఉక్కపోత తీవ్రంగానే ఉంది. కానీ ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితులు, అస్థిరమైన సము­ద్రపు గాలుల కలయిక వల్ల తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పట్టణాల్లో పెరుగుతున్న కాంక్రీట్‌ కట్టడాల ప్రభా­వం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చివేసింది.

ముప్పు ఏమిటి? 
గాలిలో తేమ 70 శాతం ఉండి, ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నా అది మన శరీరానికి 48 డిగ్రీల ఎండలో ఉన్నంత ప్రభావం చూపుతుంది. ఈ వేసవిలో ఇలాంటి అసౌకర్య రోజులు గతం కంటే 15 – 20 రోజులు అదనంగా ఉంటాయని అంచనా. 

జాగ్రత్తలు ముఖ్యం.. 
హీట్‌ ఇండెక్స్‌ గమనించండి: కేవలం డిగ్రీలను మాత్రమే కాకుండా ‘హీట్‌ ఇండెక్స్‌’ (గాలిలోని తేమను కలిపి చూపే ఉష్ణోగ్రత)ను గమనించాలి. ఫోన్లలోని వాతావరణ యాప్స్‌లో ఫీల్స్‌ లైక్‌ అని ఉండే ఉష్ణోగ్రతే దీనికి సంకేతం. 

నీటి వినియోగం: దాహం వేయకపోయినా నీరు తాగుతూ ఉండాలి. మాయిస్ట్‌ హీట్‌లో చెమట ఆవిరి కాకపోయినా శరీరం లోపల నీటి శాతం తగ్గుతుంది. 

గాలి సరఫరా: గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవాలి. తేమ ఎక్కు­వగా ఉన్నప్పుడు కేవలం ఫ్యాన్‌ వేసుకున్నా వేడి గాలి మాత్రమే వస్తుంది. కాబట్టి కిటికీలు తెరిచి ఉంచడం లేదా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు వాడడం మంచిది. 

Advertisement
 
Advertisement
Advertisement