చిలకలూరిపేటలో సిబ్బంది ర్యాలీ, ధర్నా
డీఈఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఎమినిటీస్ సెక్రటరీ మీద మున్సిపల్ డీఈఈ దూషణలపై ఆగ్రహం
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం వార్డు సచివాలయంలో ఎమినిటీస్ సెక్రటరీ కె.శ్రీనివాస్‌పై మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం ఇటీవల నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడాన్ని నిరసిస్తూ సచివాలయాల ఉద్యోగులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. అనంతరం.. ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు షేక్ మొహమ్మద్ ఆలీ మాట్లాడుతూ.. ఒకవైపు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఉన్నతాధికారుల తీరులో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. సభ్యసమాజం వినలేని విధంగా మున్సిపల్ డీఈఈ ఫోన్‌లో దూషణలకు పాల్పడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండేళ్ల కాలంలో ఇప్పటికి వందమంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందులో కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు గుండెపోటుతో మృతిచెందారన్నారు. మున్సిపల్ డీఈఈ తీరు తరచూ ఇలాగే ఉంటోందని.. ఐదు నెలల కిందట మరో సచివాలయ ఉద్యోగిపట్ల కూడా ఆయన ఇలాగే వ్యవహరించారని షేక్ మొహమ్మద్ ఆలీ మండిపడ్డారు.
మూడు నెలలుగా సర్వేల పేరుతో ఒత్తిడి
ఏపీ ఎన్‌జీఓల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి కొమ్మాలపాటి ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ.. బానిసలపట్ల కూడా ఇంత అవమానకరంగా ఎవరూ మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా సర్వేల పేరుతో ఉన్నతాధికారులు దారుణంగా వ్యవహరిస్తున్న కారణంగా ఎందరో ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రభుత్వోద్యోగం అంటే గౌరవంగా ఉంటుందని భావించి వచ్చామని.. కానీ, పై అధికారుల వేధింపులు, తిట్లు తట్టుకోలేకే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సంబంధిత డీఈఈపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ ఆందోళన విషయం తెలుసుకుని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అక్కడికొచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, తమ ఆందోళన విరమించేదిలేదని వారు స్పష్టంచేసి మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబుకు వినతిపత్రం అందజేశారు.


