గుజ్జు పరిశ్రమకు గడ్డుకాలం
యుద్ధం కారణంగా కుదేలైన గల్ఫ్ మార్కెట్
హార్ముజ్ జలసంధి బంద్‌తో నిలిచిపోయిన రవాణా
పేరుకుపోయిన మామిడి గుజ్జు నిల్వలు
ఆందోళనలో ఫ్యాక్టరీ యజమానులు
సీజన్‌లో అమ్మకాలపై అయోమయంలో రైతులు
మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు తయారైంది మామిడి రైతుల పరిస్థితి. గత ఏడాది కాయలకు గిట్టుబాటు ధర లేక నష్టాలపాలైతే.. ఈ సీజన్ కూడా దెబ్బకొట్టేలా ఉండడంతో దిక్కుతోచని దుస్థితి దాపురించింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. గల్ఫ్ యుద్ధం కాస్తా గుజ్జు పరిశ్రమను అయోమయంలో పడేసింది. ఇప్పటికే లక్షల టన్నుల పల్ప్ నిల్వ ఉండడం ఫ్యాక్టరీల యజమానులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈ తరుణంల్చో ఎగుమతులు నిలిచిపోవడం.. ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో తెలియకపోవడం అయోమయానికి గురిచేస్తోంది.
కాణిపాకం : చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేశారు. దీంతో గల్ఫ్ దేశాలకు సరుకు తరలింపులు ఆగిపోయాయి. కంటైనర్ షిప్ నిర్వాహకు లు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫ్యాక్టరీలకు మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ఎప్పుడు రవాణా పునఃప్రారంభమవుతుందో స్పష్ట త లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. దీంతో మామిడి గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
గల్ఫ్ దేశాలే ఆధారం
జిల్లాలో తయారయ్యే మామిడి గుజ్జులో ఎక్కువ శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. దుబాయ్, సౌదీ అరేబియా, ఉమెన్‌న్, కతార్ వంటి దేశాలే ప్రధాన కొనుగోలుదారులు. ఏటా ఆగస్ట్ నుంచి గుజ్జు ఎగుమతులు నత్తనడకన నడిచినా... ఫిబ్రవరి నుంచి జూ¯న్ వరకు జోరందుకుంటాయి. అయితే తరచూ గల్ఫ్ దేశాల్లో తలెత్తే ఉద్రిక్తతలు మామిడి గుజ్జు పరిశ్రమలను కుదిపేస్తున్నాయి. ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. 2024లో ఇదే పరిస్థితి ఎదురైతే..పరిశ్రమ యజమానులు పలు బ్యాంకులకు అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే ప్రస్తుతం కూడా యుద్ధ ప్రభావంతో ఆర్డర్లు నిలిచిపోయాయి. హార్బర్లు సక్రమంగా పనిచేస్తాయో లేదో తెలియని దుస్థితి ఏర్పడింది. గుజ్జు అధికంగా కొనుగోలు చేసే దేశాలపై బాంబుల వర్షం కురవడంతో పరిశ్రమ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. కొంత మంది ఫ్యాక్టరీ నిర్వాహకులు ముందస్తుగానే అప్రమత్తమై గుజ్జు అమ్మకాలు పూర్తి చేసుకోవడం గమనార్హం.

రూ.36 వస్తేనే గిట్టుబాటు
గత ఏడాది నవంబర్‌లో గుజ్జు కేజీ ధర రూ.30 పలికింది. ప్రస్తుతం రూ.31 వద్దే నిలిచిపోయింది. అయితే పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, కారి్మక, రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే కేజీకి కనీసం రూ.36 వస్తేనే గిట్టుబాటు అవుతుందని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. ధరలు పెరగకపోవడంతో నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం
చేస్తు న్నారు.
యుద్ధం నిలిస్తేనే..
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులే మామిడి గుజ్జు పరిశ్రమ భవిష్యత్‌ను నిర్ణయిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుని రవాణా సాధారణ స్థితికి వస్తేనే ఎగుమతులు పునరుద్ధరించబడే అవ కాశం ఉంది. లేకపోతే ఈసారి మామిడి రంగానికి గడ్డుకాలమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ మేఘాలు తొలగకపోతే..జిల్లాలో మామిడి రైతుల నుంచి గుజ్జు ఫ్యాక్టరీల వరకు నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
తాళం వేయాల్సిందే..!
ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమల యజ మానులకు బ్యాంకు రుణాలు, వడ్డీలు, కారి్మకుల జీతాలు, విద్యుత్ బిల్లులు భారంగా మారాయి. గుజ్జు నిల్వలు అమ్ముడుపోకపోవడంతో నగదు ప్రవాహం నిలిచిపోయింది. ఈ పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగితే ఫ్యాక్టరీలకు తాళం వేసే పరిస్థితి వస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు.
రైతుల ఆందోళన
ఈసారి మామిడి పూత విస్తారంగా రావడంతో దిగుబడి బాగుంటుందనే అంచనాలు ఉన్నాయి. చెట్టు నిండా పూతతో కళకళలాడుతున్నాయి. అయితే గుజ్జు పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపేస్తే కాయలకు డిమాండ్ తగ్గిపోతుందని రైతులు భయపడుతున్నారు. కొనుగోలు శక్తి తగ్గిపోతే ధరలు పడిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రవాణా నిలిచిపోయింది
ఇప్పుడిప్పుడే గుజ్జు ఎగుమతులు ప్రారంభయ్యాయి. ఢోకా లేదు అనుకున్న తరుణంలో యుద్ధం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఎక్కడైతే గుజ్జు ఎక్కువ అమ్ముడవుతుందో అక్కడే బాంబులు పడుతున్నాయి. షిప్‌లు కూడా ఆగిపోయాయి. రవాణా నిలిచిపోయింది. కంటైనర్లు తరలించబోమని మెయిల్ కూడా వచ్చింది. యుద్ధం కొనసాగితే గుజ్జు అలానే ఉండిపోయే ప్రమాదముంది. ఫ్యాక్టరీలకు తాళం వేయడం తప్ప..వేరే మార్గం లేదు. – గోవర్ధన్ బాబీ, ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్, న్యూఢిల్లీ


