సమాధానం చెప్పలేక సత‘మతం’! | Chandrababu Naidu govt diversion politics on Tirumala Laddu Issue | Sakshi
Sakshi News home page

సమాధానం చెప్పలేక సత‘మతం’!

Mar 5 2026 4:56 AM | Updated on Mar 5 2026 4:56 AM

Chandrababu Naidu govt diversion politics on Tirumala Laddu Issue

‘లడ్డూ’పై చంద్రబాబు సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌

వెబ్‌సైట్‌లో తీసేస్తే హెరిటేజ్‌కు, ఇందాపూర్‌కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా? అంటూ అచ్చెన్న వ్యాఖ్యలు 

దీన్ని కవర్‌ చేసుకునేందుకు మండలి చైర్మన్‌పై వ్యక్తిగత దూషణలు

చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు.. రభస 

విపక్ష సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి 19 నిమిషాలు మాట్లాడితే 12 సార్లు అడ్డు తగిలి పక్కదారి పట్టించిన అధికార పక్షం.. తూమాటిపైకి దూసుకొచ్చిన మంత్రి ఆనం  

చంద్రబాబు రాజకీయ కుట్రతో ప్రారంభమైన ‘నెయ్యి’ ఆర్థిక కుట్రగా ఎలా మారిందో సాక్ష్యాలతో సభలో ఎండగట్టిన వైఎస్సార్‌సీపీ 

పవిత్ర లడ్డూ ప్రసాదంపై ‘జంతుకొవ్వు’ ఆరోపణలు చేసిన చంద్రబాబును హిందూ సమాజం క్షమించదు  

తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను తిరిగి వైష్ణవీ డెయిరీ ద్వారా తెచ్చింది బాబు హయాంలోనే  

ఇందాపూర్‌ డెయిరీని తమ తయారీ సంస్థగా హెరిటేజ్‌ తన వెబ్‌సైట్‌లోనే పేర్కొంది 

ఈ విషయం బయటపడగానే కో–మాన్యుఫాక్చరర్‌గా మార్చేసింది 

ఇందాపూర్‌ కోసం నిబంధనలు మార్చామని మీ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారు 

ప్రభుత్వ సంస్థలకు సరఫరాకు దూరంగా ఉండాలంటూ హెరిటేజ్‌ నిర్ణయం  తీసుకుందని చంద్రబాబు శాసనసభను తప్పుదోవ పట్టించారు. 

టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో హెరిటేజ్‌ పాల్గొంది.. హెరిటేజ్‌ మజ్జిగ కొనాలంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు 

సాక్ష్యాధారాలతో మండలిలో ప్రభుత్వాన్ని ఎండగట్టిన వైఎస్సార్‌సీపీ సభ్యులు చంద్రశేఖరరెడ్డి, మాధవరావు 

సాక్షి, అమరావతి: పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చార్జిషీట్‌లో సీబీఐ తేల్చేసినా, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు నిర్ధారించినా పశ్చా­త్తాపం లేదు..! కనీసం చట్టసభలోనూ కూటమి సర్కారు స్పందించలేదు! 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్‌ డెయిరీకి ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా జవాబు లేదు! ఇటీవల వరకు హెరిటేజ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా చూపించిన ఇందాపూర్‌ డెయిరీని గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా మార్చేయడంపైనా నోరు విప్పలేదు! చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ రిజెక్ట్‌ చేసిన నెయ్యి ట్యాంకర్లను దొడ్డి దారిన రప్పించి తిరిగి అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూల తయారీకి వాడినట్లు సాక్షాత్తూ సీబీఐ తేల్చేసినా సమాధానం లేదు! ప్రభుత్వ టెండర్లలో హెరి­టేజ్‌ ఎప్పుడూ పాల్గొనలేదంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం లేదని.. మండలి సాక్షిగా విపక్షం ఆధారా­లను బహిర్గతం చేస్తే సమాధానం అంతకంటే లేదు!!

చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకే
తిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు, సీబీఐ చార్జిషీట్‌లో తేల్చేయడం.. ఇందాపూర్‌ డెయిరీతో హెరిటేజ్‌ వ్యాపార అనుబంధం.. నెయ్యిపై రాజకీయ, ఆర్థిక కుట్రలు బహిర్గతం కావడం.. ఇదంతా చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు లబ్ధి చేకూర్చేందుకేనని తేటతెల్లం కావడం.. టీడీపీ కూటమి సర్కారుకు దుర్బుద్ధి లేకుంటే దీనిపై చట్టసభలో చర్చకు ఎందుకు జంకుతోందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకోవడం.. శాసన మండలి చైర్మన్‌ న్యాయం వైపు గట్టిగా నిలబడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు ఒప్పుకున్నట్లు నటిస్తూనే చంద్రబాబు సర్కారు డ్రామాలాడటం పట్ల హైందవ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతున్నాయి. 

ఇన్ని రోజులూ మొహం చాటేసిన చంద్రబాబు సర్కారు కుట్ర బుద్ధితో టాపిక్‌ డైవర్షన్‌ రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా అధికార పక్షమే ఇన్ని రోజులు సభను అడ్డుకున్న దాఖలాలు దేశ చరిత్రలో లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూపై శాసన మండలిలో బుధవారం చర్చ మొదలు కాగానే మంత్రులు అడ్డుపడటం.. మతం ప్రస్తావన తేవడం.. ఎస్సీ వర్గానికి చెందిన మండలి చైర్మన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా వ్యూహం ప్రకారం లడ్డూపై చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేనని మండలి సాక్షిగా బహిర్గతమైందని పేర్కొంటున్నారు. 

లడ్డూపై సభలో చర్చ జరిగితే చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుంభకోణం కుట్రలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టీడీపీ తనకు అలవా­టైన రీతిలో డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ఎంచుకుందని స్పష్టం చేస్తున్నారు. వెబ్‌సైట్‌లో తీసేస్తే హెరిటేజ్‌కు, ఇందాపూర్‌­కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా? ఒక పరిశ్రమ మరో పరిశ్రమతో కలసి వ్యాపారం చేస్తోందంటే వెబ్‌సైట్‌లో తీసేస్తే అయిపోతుందా? అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్న దీన్ని కవర్‌ చేసుకునేందుకే ‘మతం’ ప్రస్తావన తెచ్చారని విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి మొత్తం 19 నిమిషాలు మాట్లాడితే అందులో 12 సార్లు అడ్డుపడ్డారంటే అధికారపార్టీ ఏ స్థాయిలో భ­యపడిందో చెప్పేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.


బాబూ.. హిందూ సమాజం నిన్ను క్షమించదు..!
రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి వ్యవహారం ఆర్థిక కుట్రగా ఎలా మారిందో విపక్ష సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, తూమాటి మాధవరావు సాక్ష్యాధారాలతో శాసన మండలిలో ఎండగట్టారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ దు­ష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును హిందూ సమాజం క్షమించబోదని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్‌పై నమ్మకం లేకనే వైవీ సుబ్బారెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని గుర్తు చేశారు. 

చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌కు ఇందాపూర్‌ డెయిరీతో ఉన్న సంబంధాలను సాక్ష్యా­ధారాలతో వివరించారు. హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లో ఇన్నాళ్లూ తమ తయారీ సంస్థగా చూపించిన ఇందాపూర్‌ డెయిరీని ఆరోపణలు రాగానే హఠాత్తుగా కో–మాన్యుఫాక్చర్‌గా మార్చడంతో పాటు మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌తో రాజీనామా చేయించిన వైనాన్ని వివరించారు. 2016లో టీటీడీ నాణ్యత పరీక్షల్లో ఇందాపూర్‌ డెయిరీ ఫెయిల్‌ అయ్యిందని, ఇప్పుడు అదే ఇందాపూర్‌కి రూ.680కి నెయ్యి సరఫరా అప్పగించడం వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉందన్నారు. ఏఆర్‌ డెయిరీ, బోలేబాబా డెయిరీలను టీడీపీ  ప్రభుత్వమే అనుమతించిందని, వారి హయాంలోనే ఏఆర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. 

నాణ్యతా ప్రమాణాలు లేనందున నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరిస్తే వాటిని ఎవరి ఒత్తిడి మేరకు సంగం డెయిరీతో సంబంధం ఉన్న వైష్ణవీ డెయిరీ ద్వారా అనుమతించారో చెప్పాలంటూ నిలదీశారు. కల్తీ నెయ్యి సరఫరా టీడీపీ హయాంలో జరిగితే వైఎస్సార్‌ సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఎన్‌డీడీబీ రిపోర్టు, సీబీఐ చార్జిషీటులో ఎక్కడా కూడా జంతుకొవ్వు కలిసిందని లేకపోయినా 120 కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని హేళన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. సీబీఐ చార్జిషీటులో టీటీడీ జీఎం ఫిర్యాదును ప్రస్తావిస్తే, అదే నివేదిక అంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. 

హెరిటేజ్‌ ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనలేదంటూ శాసన సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో పాల్గొందని పేర్కొన్నారు. ఒకసారి టీటీడీకి హెరిటేజ్‌ పాలపొడి సరఫరా చేయగా బిల్లులు ఆగిపోతే ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రిజల్యూషన్‌తో డబ్బులు తీసుకున్న వైనాన్ని ఆధారాలతో వివరించారు. హెరిటేజ్‌ మజ్జిగ సరఫరాకు సంబంధించి కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా సభ ముందుంచారు. 

చంద్రబాబు కుటుంబంతో కలసి గత ఐదేళ్లలో పలుదఫాలు తిరుమల వెళ్లి ప్రసాదం తిన్నారని మరి ఎప్పుడైనా లడ్డూ కల్తీ జరిగిందని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి బాగుందంటూ తిరుమల లడ్డూలు తిన్న కూటమి నేతలు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఇందాపూర్‌ కోసం నిబంధనలు మార్చామని స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారని గుర్తు చేశారు. కేవలం గేదె పాలను మాత్రమే సేకరిస్తున్న సంగం డెయిరీ ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ఒకానొక దశలో తమ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలని కోరిన తూమాటి మాధవరావుపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దాడి చేసే యత్నం చేశారు. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్యలో కూడా విపక్ష వైఎస్సార్‌ సీపీ సభ్యులు పూర్తి ఆధారాలతో చంద్రబాబు కుట్రను మండలి సాక్షిగా బయటపెట్టారు.

⇒ అంతకుముందు స్వల్పకాలిక చర్చ కంటే ముందు మంత్రి స్టేట్‌మెంట్‌ ఇస్తారంటూ అధికారపార్టీ సభ్యులు చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అయితే సభలో కొత్త సంప్రదాయాలకు అవకాశం లేదని, నిబంధనల ప్రకారమే చర్చ తర్వాత ప్రభుత్వం స్టేట్‌మెంట్‌ ఇస్తుందంటూ చైర్మన్‌ చర్చను ప్రారంభించారు. టీడీపీ తరపున అనురాధ మాట్లాడుతూ దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement