27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి  | Tekali Engineering Student Ends Life In Srikakulam | Sakshi
Sakshi News home page

27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి 

Mar 5 2026 8:10 AM | Updated on Mar 5 2026 8:10 AM

Tekali Engineering Student Ends Life In Srikakulam

రైలు కింద పడి ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి 

27న పెళ్లికి ముహూర్తం నిర్ణయించిన పెద్దలు 

వేణుగోపాలపురంలో విషాదచాయలు   

 

ఇద్దరూ కూతుళ్లే అని ఆ తల్లిదండ్రులు కుమిలిపోలేదు. భారంగా భావించనూ లేదు. తాహతుకు మించి పెంచారు.. ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇంజినీరింగ్‌ చదువుతున్న పెద్దమ్మాయికి పెళ్లి చేసి బాధ్యత నెరవేర్చాలనుకున్నారు. మంచి సంబంధం చూసి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసిన ఆ తల్లిదండ్రుల ఆనందం అంతలోనే ఆవిరి అయిపోయింది. పెళ్లికూతురి ముస్తాబులో కళకళలాడాల్సిన కుమార్తె పట్టాల మీద ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారడం వారిని కలచి వేసింది. ఇంతకూ ప్రవల్లిక మరణానికి కారణం     ఏమిటి..! బలవన్మరణానికి పాల్పడిందా? పెళ్లి ఇష్టం లేదా?? ఇంకేదైనా బలమైన కారణం ఉందా??? పోలీసు దర్యాప్తులోనే తేలుతుంది.

టెక్కలి రూరల్‌/నందిగాం:  టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీలో ఐటీ సెకెండియర్‌ చదువుతున్న కింతలి ప్రవల్లిక(19) బుధవారం రైలు కింద పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. నందిగాం మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కింతలి గోపాలరావు, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ప్రవల్లిక ఆదిత్య ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతుండగా, చిన్న కుమార్తె హారిక గుంటూరులో బీఎస్సీ నర్సింగ్‌ చదువుతోంది. గోపాలరావు తాపీమేస్త్రీ కాగా శిరీష గృహిణి. ప్రవల్లికకు ఈ నెల 27న వివాహం చేసేందుకు నిశ్చయించారు. 

ఎప్పట్లాగే బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లిన ప్రవల్లిక టెక్కలి మండలం తలగాం సమీపంలో  సాయంత్రం వచ్చే రాజారాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి మృతి చెందింది. గమనించిన స్థానికులు ఐడీ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెలవిసేలా రోదించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా,కాలేజీకి వెళ్లిన ప్రవల్లిక నందిగాం వైపు రాకుండా నౌపడ రూట్‌ ఎందుకు వెళ్లింది.. మృతి చెందడానికి కారణాలు ఏంటనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement