టెండర్లలో పచ్చపాతం | - | Sakshi
Sakshi News home page

టెండర్లలో పచ్చపాతం

Mar 5 2026 7:42 AM | Updated on Mar 5 2026 7:42 AM

కమీషన్ల కక్కుర్తితో అడ్డగోలుగా

వ్యవహరిస్తున్న కీలక నేత

కార్పొరేషన్‌లో చెప్పినోళ్లకే టెండర్లు ఖరారు చేయాలని ఆదేశం

ఇతరులు పాల్గొంటే బిడ్‌

ఓపెన్‌ చేయకుండా తాత్సారం

మండిపడుతున్న కాంట్రాక్టర్లు

వాన్‌ పార్కుకే మరో టెండర్‌ కూడా పిలిచారు. దాని విలువ రూ.25 లక్షలు. ఈ వర్క్‌కు కీలక నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ముగ్గురు టెండర్లలో పాల్గొన్నారు. తాము చెప్పినా టెండర్లలో పోటీ పడ్డారనే అక్కసుతో ఆ బిడ్‌ తెరవకుండా నిలిపివేశారు. నెలలు గడుస్తున్నా టెండర్లు ఖరారు చేయలేదు. అలాగని, రద్దు చేయడం లేదు. తాత్సారం చేస్తూ ఏదో ఒక రోజున రద్దు చేసేసి, తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

కాలుష్య నియంత్రణ మండలి(ఎన్‌ క్యాప్‌) కింద మంజూరైన నిధులతో జవాన్‌ పార్కుకు కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి ఇటీవల టెండర్లు పిలిచారు. రూ.55 లక్షల విలువైన ఓపెన్‌ టెండర్లను ఆహ్వానించారు. కానీ, నియోజకవర్గ కీలక నేత అనుచరుడు ఆసక్తి గల కాంట్రాక్టర్లను బెదిరించారు. ఎవరూ టెండర్లు వేయవద్దని ఒత్తిడి చేశారు. దీంతో ఆ కీలక నేత సూచించిన ఒకరే టెండర్‌ వేశారు. ఎస్టిమేట్‌ రేట్‌కు కాంట్రాక్ట్‌ దక్కించుకున్నారు. టెండర్లు వేసుకోవడానికి అందరికీ అవకాశమిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.10లక్షలు మిగిలి ఉండేది. సింగిల్‌ టెండర్‌ వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయింది. వాస్తవానికి సింగిల్‌ టెండర్‌ పడితే రింగ్‌ అయ్యారన్న కారణంతో రద్దు చేయాలి. కానీ, ఆ పని చేయలేదు.

జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.28.35లక్షలకు టెండర్లు పిలిచారు. దీంట్లో ముగ్గురు పాల్గొన్నారు. ఒకరు మాత్రమే కీలక నేతకు సంబంధించిన వ్యక్తి. దీంతో మిగిలిన ఇద్దరిని తప్పుకోమని హుకుం జారీ చేశారు. అందులో ఒకరు భయపడి తప్పుకున్నారు. ఇంకొకరు ఇంకా తప్పుకోలేదు. ఆ వ్యక్తి కూడా తప్పుకోలేదని సదరు టెండర్‌ను ఇంకా తెరవలేదు. వాళ్లకు కావల్సిన వ్యక్తికి వచ్చేవరకు ఆ టెండర్‌ తెరిచే పరిస్థితి కన్పించడం లేదు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

శ్రీకాకుళం కార్పొరేషన్‌లో జరుగుతున్న టెండర్‌ బాగోతాలివి. నియోజకవర్గ కీలక నేత పెద్ద ఎత్తున కక్కుర్తి పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో జరిగే అభివృద్ధి పనులన్నీ తన మనుషులే చేయాలని.. పర్సంటేజీలు తనకే రావాలని నియంతలా వ్యవహరిస్తున్నారు. ఏదైనా తన ద్వారానే జరగాలని, తాను చెప్పినోళ్లకి పనులు కట్టబెట్టాలని హకుం జారీ చేస్తున్నారు. కాదూ కూడదంటే ఇక్కడ పనిచేయలేవంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఫలితంగా నగరంలో జరిగే అభివృద్ధి పనుల టెండర్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరుగుతోంది.

అంతటా అదే ధోరణి..

శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలో కూడా ఇదేరకంగా అభివృద్ధి పనుల టెండర్లలో ఇతరులు పాల్గొన్నారని ఏకంగా రద్దు చేయించారు.

● ఒక్క టెండర్లే కాదు గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లో కూడా అదే పచ్చపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు.

● తనకు పర్సంటేజీలు ఇచ్చినోళ్లకు, తనకు కావల్సిన వారికి మాత్రమే బిల్లులు చెల్లింపులు చేయిస్తున్నారు.

● మిగతా వాళ్ల బిల్లులకు అడ్డుగా నిలుస్తున్నారు. దీంతో మిగిలిన కాంట్రాక్టర్లు నష్టపోతున్నారు. సొంత డబ్బులతో పనులు చేసి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● కీలక నేత పేరు గల వ్యక్తులే కార్పొరేషన్‌లో చక్రం తిప్పుతున్నారు. అన్నీ పనులు ఆ ముగ్గురే చేస్తూ పెద్ద ఎత్తున లబ్ధిపొందుతున్నారు.

● నాసిరకం పనులు చేసి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఎంత దారుణమంటే టెండర్లు పిలవకుండా కూడా కొన్ని పనులు చేయించేశారు.

కాలుష్య నియంత్రణ నిధులు పక్కదారి

కాలుష్య నియంత్రణ మండలి(ఎన్‌ క్యాప్‌) కింద మంజూరైన నిధులు కాలుష్యం తగ్గించే పనులకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఏం చేస్తే నగరంలో కాలుష్యం తగ్గుతుందో వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకు భిన్నంగా ఎన్‌ క్యాప్‌ నిధులను పార్కు కాంపౌండ్‌ వాల్‌ పనులకు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల కాలుష్యం ఎలా తగ్గుతుందో నేతలకు, అధికారులకే తెలియాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement