సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రాజకీయ కక్ష సాధింపులతో చేసిన చెక్ పవర్ రద్దును ఎట్టకేలకు అధికారులు ఉపసంహరించుకున్నారు. ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు వైఎస్సార్ సీపీ సర్పంచ్ అని, గ్రామంలో కూటమి నేతల అక్రమాలకు అడ్డుపడుతున్నారని కక్ష కట్టి చెక్ పవర్ రద్దు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా చెక్ పవర్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా పంచాయతీలో ఎలాంటి అక్రమాలు, నిధులు దుర్వినియోగం జరగలేదని అధికారులు చెక్ పవర్ కొనసాగింపు ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. ఈ విషయమై సర్పంచ్ రాంబాబుతో పాటు ‘సాక్షి’ పత్రిక అధికారుల తీరును, ఎమ్మెల్యే, మంత్రుల ఒత్తిళ్లను కథనాల రూపంలో ఎండగట్టింది. ఈ కథనాలు ఆధారంగా చేసుకుని సర్పంచ్ రాంబాబు కూడా హైకోర్టును ఆశ్రయించారు. పక్కా ఆధారాలు చూపించడంతో హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. తక్షణమే చెక్ పవర్ పునరుద్ధరించాలని ఆదేశాలిచ్చింది. దీనిపై కూడా అధికారులు తాత్సారం చేశారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో కంటెంప్ట్‌కు కూడా సర్పంచ్ వెళ్లారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. తీసేసిన చెక్ పవర్‌ను పునరుద్ధరించడమే కాకుండా ఎటువంటి అక్రమాలు, నిధులు దుర్వినియోగం జరగలేదని చివరికి అంగీకరించారు. ఆ మేరకు చెక్ పవర్ పునరుద్ధరణ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
బొంతల కోడూరు సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరణ
ఇన్నాళ్లూ ఎమ్మెల్యే, మంత్రుల ఒత్తిళ్లతో కక్ష సాధింపు
కొన్ని నెలలుగా చెక్ పవర్ లేక నిలిచిపోయిన గ్రామాభివృద్ధి
నేతల తీరు, అధికారుల వ్యవహార శైలిపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనాలు
వాటి ఆధారంగా హైకోర్టును
ఆశ్రయించిన సర్పంచ్ రాంబాబు
ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు


