● జిల్లా కేంద్రంలో మారని పైపులైన్ల దుస్థితి
● అధికారుల హడావుడి తగ్గడంతో మళ్లీ పాత పరిస్థితే
● డయేరియా వివరాలు చెప్పేందుకు
జనం వెనుకంజ
● పాలకుల తీరుపై మండిపాటు
జిల్లా కేంద్రంలో డయేరియా కేసుల నేపథ్యంలో హడావుడి చేసిన అధికారులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేశారు. అయితే కేసులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం. డయేరియాతో బాధపడుతున్నామని చెబితే ఎక్కడ ఆస్పత్రుల్లో ఉంచేస్తారోనన్న భయంతో చాలామంది వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడుతున్నా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో ఇంటింటా సర్వేలు చేస్తున్నవారికి వివరాలు చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు నగరంలో తాగునీటి పైపులైన్ల దుస్థితి ఏమాత్రం మార్పులేదు. పైపులైన్లు ఇంకా మురుగుకాలువలోనే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా రైతుబజారురోడ్డు, రెల్లవీధి, ఆర్టీసీ కాంప్లెక్స్ దరి, దమ్మలవీధి, హయాతినగర్, గుజరాతిపేట, ఇలిసిపురం, రెల్లివీధి, కృష్ణాపార్కు, వైష్ణపు వీధి, గారవీధి, కెల్లవీధి, గుడివీధి, వాంబేకాలనీల్లో పైపులైన్లు దారుణంగా దర్శనమిస్తున్నాయి.
ముందే పరిశీలించి ఉంటే..
మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు, ఎమినిటీ సెక్రటరీలు నగరంలో కుళాయి పైపులైన్లను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం నెలకోసారైనా పరిశీలించి ఉంటే మురుగునీరు కుళాయి పైపులైన్లలోకి చేరే పరిస్థితి ఉండేది కాదని, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేది కాదని నగరవాసులు చెబుతున్నారు. ఇప్పటికై నా మేల్కొని కుళాయి పైపులైన్ల లీకులు, హెడ్‌వాటర్ వర్క్స్ వద్ద పంపుల పనితీరు, ట్యాంకుల పరిశుభ్రత, మంచినీటిలో కలుపుతున్న క్లోరిన్ మోతాదులు పరిశీలన వంటివి క్రమం తప్పకుండా చేపట్టాలని కోరుతున్నారు.
–శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)
ఇంకా కంపు నీళ్లే..
మా ప్రాంతంలో నిరంతరం కంపునీరే వస్తోంది. కుళాయి పైపులైన్లు పూర్తిగా కాలువల్లో కూరుకుపోయాయి. ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు.
– ఎం.అసిరినాయుడు, రెల్లవీధి, శ్రీకాకుళం


