బిహార్‌లోని ఎన్డీఏ ప్రభుత్వంలొ భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) పార్టీ చీలిక దిశగా పయనిస్తోంది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆర్‌ఎల్‌ఎం అధినేత ఉపేంద్ర కుష్వాహా తన కుమారుడు దీపక్ ప్రకాశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టడంతో వీరంతా రగిలిపోతున్నారు. శాసనసభ్యుడు కాకపోయినప్పటికీ తన కుమారుడిని నితీశ్ కుమార్ కేబినెట్‌లో కూర్చొబెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపేంద్ర కుష్వాహా తన కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెడుతున్నారని, తమకు ఏమీ చేయడం లేదంటూ మండిపడుతున్నారు.
ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌ఎం (RLM) ఆరు స్థానాల్లో పోటీ చేసి నాలుగు చోట్ల విజయం సాధించింది. దినారా నుంచి అలోక్ కుమార్ సింగ్, బజ్‌పట్టి నుంచి రామేశ్వర్ మహతో, మధుబని నుంచి మాధవ్ ఆనంద్ గెలిచారు. ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలత.. ససారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. పొత్తులో భాగంగా నితీశ్ కేబినెట్‌లో ఆర్‌ఎల్‌ఎంకు దక్కిన మంత్రి పదవిని అనూహ్యంగా తన కుమారుడికి కట్టబెట్టారు కుష్వాహా. స్నేహలత మంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కుమారుడిని తెరపైకి తెచ్చారు. కనీసం ఎమ్మెల్యే కూడా కానీ కొడుకుని మంత్రిని చేయడంతో మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఖిన్నులయ్యారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు (revolt) జెండా ఎగురవేశారు.
బీజేపీలోకి జంప్?
తాజాగా కుష్వాహా ఏర్పాటు చేసిన లిట్టి చోఖా విందుకు ఆర్‌ఎల్‌ఎం ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అదే సమయంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను (Nitin Nabin) కలిశారు. ఆ తర్వాత అదే రోజు ఆనంద్, మహతో బీజేపీ నాయకులను కలవడానికి ఢిల్లీకి వెళ్లి కుష్వాహాకు షాకిచ్చారు. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో జంప్ అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మర్యాదపూర్వకంగానే నబీన్‌ను కలిశామని ఎమ్మెల్యే మాధవ్ ఆనంద్ మీడియాతో చెప్పారు. కుష్వాహా కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని కుండబద్దలు కొట్టారు. పార్టీకి విధేయంగానే ఉంటామని చెప్పుకొచ్చారు.
మర్యాదపూర్వక భేటీ
''రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం కుష్వాహాకు ఆత్మహత్యాసదృశమైన చర్య. ఎందుకంటే ఆయన రాజ్యసభ ఎంపీ, ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడికి మంత్రి కట్టబెట్టారు. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, ఒకే కుటుంబంలోని ముగ్గురు పదవులు తీసుకోవడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. అయితే మేము పార్టీని వీడాలని అనుకోవడం లేదు. నబీన్‌ను కలవడం కేవలం మర్యాదపూర్వక భేటీ. కుష్వాహా కూడా ఆయనను కలిశార''ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు.
నిరసన తెలిపాం
తన కుమారుడి మంత్రి పదవి విషయంలో ఉపేంద్ర కుష్వాహా ఏకపక్షంగా వ్యవహరించారని మరో ఎమ్మెల్యే రామేశ్వర్ మహతో విమర్శించారు. ''కుష్వాహా గతంలో వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు. అకస్మాత్తుగా, ఆయన ఆ విషయాన్ని మర్చిపోయారు. తన కొడుకును మంత్రిని చేసే ముందు ఆయన మమ్మల్ని సంప్రదించలేదు. మేము పార్టీతోనే ఉన్నాం. నబీన్‌ను కలిసినంత మాత్రాన మేము బీజేపీలో చేరుతున్నామని కాదు. మా నిరసన తెలియజేయాలనే కుష్వాహా విందుకు హాజరుకాలేదు. మేం ముగ్గురు ఎమ్మెల్యేలం ఒకే మాట మీద ఉన్నాం. తదుపరి కార్యాచరణపై ఇంకా ఏమీ అనుకోలేదు. పార్టీని వీడాలా, ఉండాలా అనే దానికి నిర్ణయం తీసుకోలేద''ని ఎమ్మెల్యే మహతో తెలిపారు.
స్పందించని కుష్వాహా
తమ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని వస్తున్న వార్తలపై ఉపేంద్ర కుష్వాహా స్పందించలేదు. ఈ వ్యవహారాన్ని పెద్దదిగా చూపిస్తున్నారని ఆర్‌ఎల్‌ఎం పార్టీ (Rashtriya Lok Morcha) వర్గాలు వ్యాఖ్యానించారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని పేర్కొన్నాయి. సీనియర్ నేత జితేంద్ర నాథ్‌తో సహా ఏడుగురు నాయకులు పార్టీని వీడిన నెల రోజులకు తాజా పరిణామామం చోటు చేసుకోవడం గమనార్హం. ఉపేంద్ర కుష్వాహా తన కుమారుడికి మంత్రి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వీరంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు.
బీజేపీ, జేడీయూ స్పందన
ఆర్‌ఎల్‌ఎంలో తిరుగుబాటుపై బీజేపీ ఆచితూచి స్పందించింది. ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అటు జేడీయూ కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. తన వర్గాన్ని ఎలా ఐక్యంగా ఉంచుకోవాలో హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) అధినేత జితన్ రామ్ మాంఝీని చూసి కుష్వాహా నేర్చుకోవాలని జేడీయూ నాయకుడు ఒకరు సలహాయిచ్చారు. కాగా, బిహార్‌లో ఖాళీ అవుతున్న 5 రాజ్యసభ స్థానాల్లో తమకు ఒకటి ఇవ్వాలని మాంఝీ డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: బెంగాల్ ఎన్నికల సర్వే.. అనూహ్య ఫలితాలు!
తిరుగుబాట్లు కొత్తకాదు
ఉపేంద్ర కుష్వాహాకు (Upendra Kushwaha) తిరుగుబాట్లు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్‌ఎల్‌ఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ జేడీ(యూ) పార్టీలో చేరినా.. ఆయన తన ఆధిపత్యాన్ని కోల్పోకుండా నిలుపుకున్నారు. తాజాగా తలెత్తిన సంక్షోభాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


