పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం మొదలుపెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ తరపున ప్రచారం సాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రచార బాధ్యతను ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగానే ఆ పరిస్థితి ఉందా అంటే.. లేదనే అంటోంది తాజా సర్వే.
మళ్లీ దీదీకే చాన్స్
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముందని 'ఓట్ వైబ్' సర్వే అంచనా వేసింది. దీని ప్రకారం 39.6 శాతం మంది ఓటర్లు దీదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. కమలం పార్టీకి ఓటు వేస్తామని చెప్పిన వారు 30.5 శాతం మంది మాత్రమే. నిమ్న వర్గాల నుంచి కాషాయ పార్టీకి ఎక్కువ మద్దతు లభించడం ఆసక్తికర పరిణామం. ఎస్సీ (50%), ఎస్టీ (38%), ఓబీసీ ఓటర్లలో (44%) అధిక శాతం బీజేపీ వైపు మొగ్గు చూపారు. మైనారిటీలు మమతా బెనర్జీ పార్టీకే జై కొట్టారు. ముస్లిం ఓటర్లలో 54 శాతం మంది తృణమూల్ వైపు నిలిచారు. హిందూ సాధారణ వర్గం ఓటర్లలో అత్యధిక మద్దతు కూడా తృణమూల్ కాంగ్రెస్‌కే దక్కడం విశేషం.
ప్రభుత్వ పనితీరు.. ప్చ్
బెంగాల్ యువత ఎక్కువగా బీజేపీకి మద్దతుగా ఉన్నారని సర్వే వెల్లడించింది. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారు కాషాయపార్టీకి అండగా ఉన్నారు. సీనియర్ సిటిజనులు మాత్రం మమతా బెనర్జీపైనే నమ్మకం ఉంచారు. అయితే దీదీ ప్రభుత్వ పనితీరుపై మాత్రం బెంగాల్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రభుత్వం బాలేదని 40.6 శాతం మంది నిర్మోహమాటంగా తేల్చేశారు. 38.3 శాతం మంది మాత్రం ప్రభుత్వ పనితీరు బాగుదంటూ కితాబిచ్చారు. ముస్లింల్లో సగానికి పైగా మమతా ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేయగా.. ఎస్సీ, ఎస్టీల్లో మాత్రం 50 శాతం కంటే ఎక్కువ మంది పేలవం అంటూ పెదవి విరిచారు. ఓటు ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయం తీసుకోని వారు 18.5 శాతం మంది అని సర్వే తెలిపింది.
దీదీ బెస్ట్
ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ మాత్రమే సరైన నాయకురాలని బెంగాల్ ప్రజలు క్లియర్‌కట్‌గా తేల్చేశారు. సర్వేలో ఆమెకు 35.4 శాతం మంది మద్దతు ప్రకటించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారికి 20.9 శాతం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య (Samik Bhattacharya) 14.8 శాతం మద్దతుతో రెండుమూడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి.
నిరుద్యోగంపై బెంగ
ఉపాధిలేమి బెంగాల్ ప్రజలను బాగా కలవరపెడుతోంది. నిరుద్యోగం (Unemployment) పట్ల 33.8 శాతం మంది ఓటర్లు ఆందోళన వెలిచ్చారు. శాంతిభద్రతలు/మహిళల భద్రత (19.1%), అవినీతి (18.3%) గురించి కూడా బెంగాలీలు బెంగగా ఉన్నారు. మతపరమైన ధ్రువీకరణ (కమ్యునల్ పోలరైజేషన్) గురించి మాత్రం బెంగాల్ ఓటర్లు (3 శాతం) పెద్దగా పట్టించుకోలేదు. నాయకత్వం లేదా సిద్ధాంతం ఆధారంగా కాకుండా.. ప్రభుత్వ పనితీరును చూసే ఓటు వేస్తామని 29.3 శాతం మంది చెప్పడం గమనించాల్సిన విషయం.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
ఎమ్మెల్యేల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు సర్వే బయటపెట్టింది. కేవలం 26.9 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకునేందుకు అనుకూలంగా ఉన్నారు. అదే పార్టీ నుండి వేరే అభ్యర్థిని నిలబెట్టాలని ఎక్కువ మంది ఓటర్లు కోరుకుంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థిని మార్చకపోతే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయాలని యోచిస్తున్నారు.
బీజేపీకి అదే మైనస్
బెంగాల్‌లో బీజేపీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు అంతర్గత కలహాలు, వర్గ విభేదాలని 20 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. బెంగాల్ సంస్కృతిని (Bengal culture) అర్థం చేసుకోలేదనే అభిప్రాయాన్ని 16.2 శాతం మంది సర్వేలో వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన రాష్ట్ర నాయకుడు లేకపోవడం బీజేపీకి మరో మైనస్ అని 14.5 శాతం మంది పేర్కొన్నారు.
చదవండి: చిరాగ్ పాశ్వాన్ ఈసారైనా చక్రం తిప్పుతారా?
టీఎంసీకి కబీర్ ఎఫెక్ట్
టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ (Humayun Kabir).. తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్‌కు గండి కొట్టే అవకాశముందని ఓటర్లలో 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆయన వెనుక బీజేపీ లేదా టీఎంసీ ఉండివుండొచ్చన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్‌లో బాబ్రీ మాదిరి మసీదు నిర్మాణానికి పూనుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే.


