కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మరోసారి సొంత రాష్ట్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ మంచి ఫలితాలే సాధించింది. అయితే ఆయన అనుకున్నది మాత్రం వేరు. ఎన్డీఏ కూటమికి తమ అవసరం పడితే బిహార్ రాజకీయాల్లో తాను చక్రం తిప్పాలని ఆయన భావించారు. ఒకానొక దశలో తాను సీఎం రేసులో ఉన్నట్టు సంకేతాలిచ్చారు. కానీ నితీశ్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీ సాధించడంతో చిరాగ్ ఆశలు నెరవేరలేదు. నితీశ్ కేబినెట్‌లో తమ పార్టీకి దక్కిన రెండు మంత్రి పదవులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈసారి తన తల్లి రీనా పాశ్వాన్‌ను (Reena Paswan) తెరపైకి తెచ్చేందుకు చిరాగ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన తల్లిని పెద్దల సభకు పంపించేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. బిహార్ నుంచి త్వరలో ఖాళీ అవుతున్న 5 రాజ్యసభ సీట్లలో తమకు ఒకటి దక్కేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 19 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న తమ పార్టీకి రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని బీజేపీ నాయకత్వంపై చిరాగ్ పాశ్వాన్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని లోక్ జనశక్తి పార్టీ (ఆర్వీ) వర్గాలు వెల్లడించాయి. చిరాగ్ తన తల్లి రీనా పాశ్వాన్‌ను రాజ్యసభ ఎన్నికల బరిలోకి దింపే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు.
ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ
బిహార్ నుంచి ఏప్రిల్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆర్జేడీ ఎంపీలు ప్రేమ్ చంద్ గుప్తా, అమరేంద్ర ధారి సింగ్.. జేడీయూ ఎంపీలు హరివంశ్, రామ్ నాథ్ ఠాకూర్‌లతో పాటు రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత ఉపేంద్ర కుష్వాహా (Upendra Kushwaha) పదవీ కాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది. ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లను దక్కించుకునేందుకు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కసరత్తు మొదలుపెట్టాయి.
బీజేపీ నుంచి ఎవరు?
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను పెద్దల సభకు పంపే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆర్‌ఎల్‌ఎం అధినేత కుష్వాహా కూడా మరోసారి అవకాశం కోసం చూస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గత ఏడాది బీజేపీలోకి తిరిగి వచ్చినప్పటికీ బిహార్ ఎన్నికల్లో పోటీచేయలేదు.
జేడీయూ నుంచి మళ్లీ వారే?
హరివంశ్, రామ్ నాథ్ ఠాకూర్‌లను జేడీయూ మళ్లీ రాజ్యసభకు నామినేట్ అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్ట్ దిగ్గజం కర్పూరి ఠాకూర్ కుమారుడైన రామ్ నాథ్ ఠాకూర్ కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) అధినేత జితన్ రామ్ మాంఝీ కూడా రాజ్యసభ సీటు కావాలని అడుగుతున్నారు.
సీటుకు 41 మంది మద్దతు
బిహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులున్నారు. ఒక్కో రాజ్యసభ సీటుకు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అధికార ఎన్డీఏ సర్కారు తనకున్న 202 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నాలుగు స్థానాలను గెలుచుకోగలదు. ఐదో స్థానాన్ని దక్కించుకోవాలంటే బయట నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి.
చదవండి: నవనీత్ కౌర్‌కు అసదుద్దీన్ కౌంటర్
ఎంఎంఐ కీలకం
ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కూటమికి 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విపక్ష కూటమి రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఎంఐ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఏకైక బీఎస్పీ సభ్యుడి మద్దతు కోసం పార్టీలు ప్రయత్నిస్తాయని రాజకీయ విశ్లేషకుడొకరు తెలిపారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే బిహార్‌లో ఖాళీ అవుతున్న ఐదు రాజ్యసభ స్థానాలను దక్కించుకునేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని స్పష్టం అవుతోంది.


