తాను దురాశపరుడిని కాదంటున్నారు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్. ఎన్డీఏ కూటమికి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి తమకు దక్కకపోవడం పట్ల ఎలాంటి విచారం లేదన్నారాయన. డిప్యూటీ సీఎం పదవి ఎల్జేపీకి రాకపోవడంపై పట్నాలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, జేడీయూ నుంచి విజయ్ కుమార్ సిన్హాలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించిన సంగతి తెలిసిందే.
బిహార్ ప్రభుత్వంలో తమకు దక్కిన దానితో సంతోషంగా ఉన్నానని, తనకు దురాశ లేదని చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) అన్నారు. తనపై విశ్వాసం ఉంచి శాసనసభ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసే అవకాశం తమ పార్టీకి ఇచ్చారని గుర్తుచేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో తమ పార్టీకి రెండు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని తెలిపారు. ఇంతకంటే ఎక్కువ ఆశించడం దురాశ అవుతుందని వ్యాఖ్యానించారు.
దురాశపరుడిని కాదు
''ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశిస్తే నా కంటే కృతఘ్నడు, దురాశాపరుడు ఎవరు ఉండరు. మా పార్టీకి ఎన్డీఏ ఇంత చేసిన తర్వాత కూడా నేను బాధ పడుతూ ఉంటే.. సంతోషాన్ని ఎలా ఆస్వాదించాలో నాకు తెలియదన్నట్టుగా ఉంటుంద''ని చిరాగ్ పేర్కొన్నారు.
విశ్వాసపాత్రుడిగా ఉంటా
కష్టకాలంలో తన వెంటే నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి విశ్వాసపాత్రుడిగా ఉంటానని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ''నేను ఎక్కడి నుండి వచ్చానో మీరు ఆలోచించాలి. 2021లో నా చుట్టూ ఒక్క వ్యక్తి కూడా లేడు. మా పార్టీ చీలిపోయింది. ప్రధానమంత్రి నాపై నమ్మకం ఉంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీకి ఐదు సీట్లు ఇచ్చారు. వారి నమ్మకం కారణంగానే నేను మళ్లీ పుంజుకున్నాను. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన''ని చెప్పారు.
ఓడిపోయే సీట్లు ఇచ్చారు.. అయినా గెలిచాం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే స్థానాలను ఎల్‌జేపీకి కట్టబెట్టారనే కామెంట్స్‌పై చిరాగ్ స్పందిస్తూ.. అది నిజమేనని అంగీకరించారు. తమ పార్టీకి చెందిన 29 మంది అభ్యర్థుల్లో 26 మంది ఓడిపోయే స్థానాల్లో పోటీ చేశారన్నది ముమ్మాటికీ వాస్తమని పేర్కొన్నారు. అయితే తమ పార్టీ అంచనాలను తలకిందులు చేసి 19 సీట్లు గెలిచిందని తెలిపారు.
చదవండి: బిహార్ కేబినెట్‌లో బిగ్ సర్‌ప్రైజ్!
తమ పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) ఆశిస్తున్నట్టు ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, జేడీయూకు తిరుగులేని ఆధిక్యం లభించడంతో చిరాగ్ డిమాండ్ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇచ్చిన రెండు మంత్రి పదవులతో ఆయన సరిపెట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


