'వాళ్లే నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశారు. దారుణంగా అవమానించి పుట్టించి నుంచి వెళ్లగొట్టారు' అంటూ తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్‌లపై లాలూ ప్రసాద్ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా కారణం వారేనని ప్రకటించారు. లాలూ కుటుంబంలో చిచ్చు రేగడానికి కారణమైన సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు, ఎక్కడి వారు, వారి బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకునేందుకు నెటిజనులు ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు.
ఎవరీ సంజయ్ యాదవ్?
సంజయ్ యాదవ్ (Sanjay Yadav) ఆర్జేడీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. తేజస్వీ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన రాజకీయ సలహాదారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాన్ని రూపొందించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆర్జేడీ పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం హరియాణాకు చెందిన సంజయ్ 2010లో తొలిసారిగా తేజస్వీని కలిశాడు. 2012లో దాణా కుంభకోణంలో లాలూపై అభియోగాలు మోపిన సమయంలో.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక కార్యక్రమంలో తేజస్వీకి సంజయ్‌ను పరిచయం చేశారు. అప్పటి నుంచి వారి బంధం కొనసాగుతోంది. ఢిల్లీలో ఉద్యోగం వదిలేసి పట్నాకు వచ్చేశారు. మొదట్లో ఆర్జేడీ సోషల్ మీడియా వ్యవహారాలు చూసేవారు.
ఆర్జేడీలో తేజస్వీ యాదవ్ బలం పెరగడంతో సంజయ్ కూడా త్వరగా ఎదిగాడు. ఆయనకు రాజకీయ వ్యూహకర్తగా, సలహాదారుగా ఉంటూ పార్టీలో కీలకంగా మారారు. గతేడాది ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని లాలూ పెద్ద కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ మీసా భారతి (Misa Bharti) తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిక్కెట్లు అమ్ముకున్నారని ఆర్జేడీ మదన్ షా తీవ్రమైన ఆరోపణలు చేశారు. సంజయ్‌ను తేజస్వీ గుడ్డిగా నమ్మారని వాపోయారు. కాగా, సీనియర్ నేతలకు, తేజస్వీకి మధ్య గ్యాప్ పెంచారన్న ఆరోపణలు కూడా సంజయ్‌పై పార్టీ వర్గాల్లో బలంగా ఉంది.
ఎవరీ రమీజ్?
రోహిణీ ఆచార్య ప్రస్తావించిన రమీజ్ నేమత్ ఖాన (Rameez Nemat Khan).. తేజస్వీ యాదవ్‌కు చిరకాల స్నేహితుడు. వీరిద్దరినీ క్రికెట్ కలిపింది. ఇద్దరు కలిసి ఢిల్లీ, జార్ఖండ్‌లో క్రికెట్ ఆడారు. 2008-09 మధ్య కాలంలో జార్ఖండ్ అండర్ 22 జట్టుకు రమీజ్ కెప్టెన్‌గా వ్యవరించాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం తర్వాత బలపడింది. దీంతో 2016లో అధికారికంగా రమీజ్ ఆర్జేడీలో చేరాడు. తేజస్వీ యాదవ్ వ్యక్తిగత సోషల్ మీడియాను నిర్వహించడంతో సహా పలు కీలక బాధ్యతలు చేపట్టాడు.
చదవండి: లాలూ ఫ్యామిలీ.. ఎందుకిలా?
39 ఏళ్ల రమీజ్ ఉత్తరప్రదేశ్‌లోన బలరాంపూర్ ప్రాంతానికి చెందిన వారు. అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్ అల్లుడు. రమీజ్ భార్య జెబా రిజ్వాన్ తులసీపూర్ అసెంబ్లీ స్థానం నుండి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. మొదట కాంగ్రెస్ అభ్యర్థిగా, తరువాత జైలులో ఉన్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తులసీపూర్ నగర పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ ఫిరోజ్ పప్పు హత్య కేసులో రిజ్వాన్ జహీర్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇదే కేసులో రమీజ్, జెబా కూడా 2022లో అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్‌పై వీరిద్దరూ విడుదలయ్యారు.


