సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. బీజేపీ అభ్యర్థికి బిగ్‌ షాక్‌ | Pune BJP Candidate Pooja More Jadhav Withdraws After Old Controversial Videos Surface, Watch Inside | Sakshi
Sakshi News home page

సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. బీజేపీ అభ్యర్థికి బిగ్‌ షాక్‌

Jan 2 2026 8:37 AM | Updated on Jan 2 2026 10:21 AM

Pune BJP drops Pooja More Jadhav after old videos on Fadnavis

ముంబై: మహారాష్ట్రలో పూణే మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా అభ్యర్థి గతంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, సీఎం భార్యపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, బీజేపీ హైకమాండ్‌ ఒత్తిడితో సదరు మహిళా అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.

వివరాల మేరకు.. పూణేలో మన్సిపల్‌ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కోటా కింద వార్డ్ నంబర్-2 నుంచి పూజా మోర్ జాదవ్‌ పోటీలో నిలిచారు. బీజేపీ మద్దతుతో ఆమెకు ఏబీ ఫారమ్‌ కేటాయించారు. దీంతో, ఆమె నామినేషన్‌ సైతం దాఖలు చేశారు. అయితే, రెండు రోజుల క్రితం అనూహ్యంగా ఆమెకు సంబంధించిన పలు పాత వీడియోలు సోషల్‌ మీడియాలో బయటకు వచ్చాయి. గతంలో మరాఠా విషయంలో ఆందోళనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, సీఎం భార్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పహల్గామ్‌ ఉగ్రదాడి జరిగిన సమయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలు తాజాగా వైరల్‌ కావడంతో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీంతో, బీజేపీ హైకమాండ్‌ నిర్ణయం మేరకు ఆమె తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

అనంతరం, ఈ వివాదంపై ఆమె స్పందిస్తూ..‘కొందరు వ్యక్తులు నా గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. నేను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మను అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. బీజేపీ నేతల విమర్శల కారణంగా నా నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. వీడియోలలో కనిపించే వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎవరో మహిళ చేసిన వ్యాఖ్యలను నాపై తప్పుగా ఆపాదించారు. నేను పోలీసుల లాఠీఛార్జీలు, క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కొంటున్నాను. తరచుగా కోర్టుకు సైతం వెళ్లాల్సి వస్తోంది. చట్టపరమైన కేసులను ఎదుర్కోవడానికి నా దగ్గర డబ్బు కూడా లేని సందర్భాలు ఉన్నాయి. ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుండి టికెట్ పొందడం నాలాంటి అట్టడుగు స్థాయి కార్యకర్తకు అరుదైన అవకాశం. కానీ, ఇలా జరగడం దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. మరుసటి రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement