పట్నా: ఆర్జేడీ సుప్రీం నేతగా పార్టీ శ్రేణుల గుండెల్లో నిలిచిపోయిన లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి మీద అచంచల ప్రేమతో తన కిడ్నీ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తంచేశారు.
కిడ్నీలు విఫలమై ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న వాళ్లకు కిడ్నీని దానం ఇచ్చాకే నాపై విమర్శలు చేయాలని విమర్శలు చేసే వాళ్లకు ఆమె దీటైన సవాల్ విసిరారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘లాలూపై మొసలి కన్నీరు కార్చేవాళ్లు వెంటనే ఆస్పత్రులకు వెళ్లి ఒక కిడ్నీ దానంచేసి రావాలి. అప్పుడు నాది మురికి కిడ్నీ యా కాదా అనే చర్చకు కూర్చోవాలి. తండ్రికి దానమిచ్చిన కూతురి కిడ్నీని మురికిది అంటూ హేయమైన వ్యాఖ్యానాలు చేసే వాళ్లు తొలుత కిడ్నీ ఇచ్చి లాలూ పట్ల తమ నిజమైన విధేయతను చాటుకోవాలి. హరియాణా మహాపురుషుడు, మద మెక్కిన పాత్రికేయులు ముందు కిడ్నీ ఇవ్వాలి’’ అని అన్నారు.
తేజస్వీ యాదవ్ సన్నిహిత నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్‌నుద్దేశిస్తూ హరియాణా మహా పురుషుడు అని రోహిణి వ్యాఖ్యానించారు. ‘‘ఒక బాటిల్ రక్తం దానం చేస్తే శరీరం కృషించిపోయే వాళ్లు కూడా కిడ్నీ దానంపై ప్రసంగాలిస్తారా?’’అని రోహిణి ఆగ్రహం వ్యక్తంచేసింది. మురికి కిడ్నీ ఇచ్చావంటూ సొంత కుటుంబ సభ్యులు(తేజస్వీ యాదవ్) ఇంట్లోంచి తరిమేశారని, వాళ్లతో బంధం తెంచుకున్నానని రోహిణి ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. తన సోదరిని అవమానించిన వాళ్ల అంతు చూస్తానని లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.


