హాజీపూర్: బీహార్‌లోని హాజీపూర్ పరిధిలో రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిదికి పైగా వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి తూర్పు మధ్య రైల్వే పరిధిలో జరిగిన ఈ ఘటనతో అటు అప్, ఇటు డౌన్ లైన్లలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ప్రమాదం జరిగిందిలా..
తూర్పు రైల్వేలోని అసన్సోల్ డివిజన్ పరిధిలో గల లాహబోన్- సిముల్తాలా స్టేషన్ల మధ్య శనివారం రాత్రి 11:25 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో (సీసీఆర్‌ఓ)వెల్లడించారు. గూడ్స్ రైలులోని ఎనిమిది వ్యాగన్లు ఒక్కసారిగా పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. అసన్సోల్, మధుపూర్, ఝాఝా ప్రాంతాల నుండి సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం యుద్ధప్రతిపాదికన రైలు పట్టాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
ఇటీవలి ఘటనలు..
మొన్న డిసెంబర్ 16న జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కు చెందిన గువా సైడింగ్‌లో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే ఈ రైలులోని ఒక బోగీ పట్టాలు తప్పడంతో ఖనిజ రవాణాకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. అయితే, ఇది ప్రధాన మార్గంలో జరగకపోవడంతో సాధారణ రైళ్లపై దీని ప్రభావం పడలేదు. డిసెంబర్ 20న అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతకు రైలు ఇంజిన్‌తో పాటు ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. అటవీ శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఈ ఐదు ఘటనలు చాలు.. ‘టాటా’ రియల్ హీరో..


