అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట రాజకీయం ములుపులు తీరుతోంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)(TVK Vijay) పార్టీతో పొత్తు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ మా సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి వ్యాఖ్యలు చేసిన వేళ.. బీజేపీ రంగంలోకి దిగింది. టీవీకేతో పొత్తు గురించి బీజేపీ నేతలు సీరియస్‍గా పరిశీలిస్తున్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న తమిళనాడుపై (Tamil Nadu Politics) బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతో పాటు అక్కడి అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక, తమిళనాడులో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన టీవీకే విజయ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‍గా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన విజయ్ తన పార్టీని గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీలు విజయ్ పార్టీపై ఫోకస్ పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బీజేపీ ప్లానేంటి?
విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుండటం అందరూ గమనిస్తున్నారు. ఈ క్రమంలో టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తోంది. ఇదే సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక తన పర్యటనలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామిని కలవకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎన్డీఏ కూటమి కేవలం ఒక పార్టీకే పరిమితం కాదని.. డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులను ఏకం చేయాలనే బలమైన సందేశాన్ని అమిత్ షా తన మిత్ర పక్షాలకు పంపించారు. అలాగే, జనవరి 14వ తేదీన వచ్చే పొంగల్ (సంక్రాంతి) నాటికే మహాకూటమి రూపకల్పనపై స్పష్టత రావాలని అమిత్ షా.. తమిళనాడు బీజేపీ కార్యవర్గాన్ని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ముందే ప్రారంభించాలని సూచించారు.
అయితే ఇప్పటికే తాము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న టీవీకే పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. మరోవైపు.. ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా ఉంది. టీవీకే పార్టీ ఏర్పాటు తర్వాత విజయ్ తమిళనాడులోని అధికార డీఎంకేను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటూ పలుమార్లు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, విజయ్ మధ్య గ్యాప్‌ను ఉపయోగించుకుని టీవీకేను తన వైపు తిప్పుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
టీవీకే నేత సంచలన ప్రకటన..!
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తమ సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లౌకికవాదం, మతత్వానికి వ్యతిరేకంగా వారి వైఖరి విషయంలో కాంగ్రెస్, టీవీకే సహజ మిత్రపక్షాలు. ఆ కోణంలో మేము ఎల్లప్పుడూ సహజ భాగస్వాములమై రాహుల్ గాంధీ, మా నాయకుడు విజయ్ కూడా స్నేహితులే అనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రాజకీయంగా వ్యూహత్మకంగా ముందుకెళ్లే బీజేపీ.. టీవీకే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. మొత్తంగా తమిళ రాజకీయం పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది.


