సాక్షి, తాడేపల్లి: ఏపీలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబునాయుడు, రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ఎంపీపీ ఉప ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం దౌర్జన్యం. ఒక చిన్న ఎంపీపీ ఉప ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బలప్రదర్శన వేదికగా మార్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వపు తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకరమైన స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది.
‘ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలంలో, ఎంపీపీ ఉప ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్తున్న మా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం, ఆ ఎంపీపీ ఉప ఎన్నికలో వారు ఓటు వేయకుండా ఆపడమే. అలా ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. తద్వారా ప్రజల గొంతును అణచి వేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో, పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడటంలో విఫలమవుతున్నారు’.
Even in a small MPP election, the way democracy is being brutally murdered exposes the extreme high-handedness of the TDP and the dangerous nature of the coalition government led by @ncbn, who has reduced elections to a show of force instead of a democratic process.
In Udayagiri… pic.twitter.com/aVzxEkRijx— YS Jagan Mohan Reddy (@ysjagan) January 5, 2026
‘రాయదుర్గం నియోజకవర్గం, బొమ్మనహల్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. మా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. అలా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిల్చి, అక్కడ ఎంపీపీ ఉప ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’.
‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేయడం, వారిపై బహిరంగంగా దాడి చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం.. ఇంకా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబునాయుడు, రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలి. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఉప ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే, ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వినియోగం చేస్తోంది.. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారింది.. అన్న విషయాలను తేటతెల్లం చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు.


