మరో రెండు రోజుల్లో 2025 ముగియబోతోంది. ఇంతలోనే దేశంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి, ఒకరు మృతి చెందారు. రైల్వేకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో రైల్వే ప్రయాణాల్లో భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడచిన 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఎన్ని రైలు ప్రమాదాలు జరిగాయి? ఎందరు మృతి చెందారు? తదితర గణాంకాలను ఇటీవలే రైల్వే బోర్డు విడుదల చేసింది.
మృతులు వందల్లో, క్షతగాత్రులు వేలల్లో..
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ)కింద దాఖలైన ప్రశ్నకు సమాధానంగా రైల్వే బోర్డు గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రైలు ప్రమాదాల వివరాలను అందించింది. ఈ గణాంకాలు రైల్వే ప్రయాణమంటేనే దడ పుట్టించేలా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో ప్రయాణికులు గాయాల పాలయ్యారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 వరకు జరిగిన ప్రమాదాల వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 766 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు రైల్వే గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సుమారు 2,126 మంది ప్రయాణికులు తీవ్రంగా లేదా స్వల్పంగా గాయపడ్డారని వెల్లడయ్యింది.
రైల్వే వ్యవస్థలో భద్రతా లోపాలు
రైల్వే బోర్డు అధికారికంగా వెల్లడించిన ఈ గణాంకాలు రైల్వే వ్యవస్థలో భద్రతా లోపాలను ఎత్తిచూపుతున్నాయి. గడచిన పదేళ్లలో రైలు ప్రమాదాల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనైంది. 2014-15లో అత్యధికంగా 135 ప్రమాదాలు నమోదు కాగా, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ, కొన్ని భారీ ప్రమాదాలు చోటుచేసుకుని, ప్రాణనష్టం మాత్రం భారీగానే సంభవించింది. మరణాల పరంగా చూస్తే 2016-17 సంవత్సరం అత్యంత విషాదకరంగా నిలిచింది. ఆ ఒక్క ఏడాదిలోనే 193 మంది రైలు ప్రమాదాల్లో మరణించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా మరణాల సంఖ్య 296కు చేరుకుంది. ఇది దశాబ్ద కాలంలో.. ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక మరణాల సంఖ్యగా రికార్డులకు ఎక్కింది.
ఒడిశా ఘోర ప్రమాదంలో అత్యధిక మృతులు
2023-24లో రైలు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం. 2023, జూన్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొనడంతో సుమారు 290 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థపై చర్చకు దారితీసింది. రైల్వే బోర్డు నివేదిక ప్రకారం.. అత్యధిక శాతం ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం (Derailments) కారణంగానే చోటుచేసుకున్నాయి. గత పదేళ్లలో 438 సార్లు రైళ్లు పట్టాలు తప్పినట్లు గుర్తించారు. వీటితో పాటు లెవల్ క్రాసింగ్‌ల వద్ద అజాగ్రత్త, రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడం (Collisions), కోచ్‌లలో అగ్నిప్రమాదాలు ఇతర ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ప్రమాదాల నివారణకు..
రైళ్లలో ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే ‘కవచ్’ (Kavach) అనే స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఒకే పట్టాలపై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసి, ప్రమాదాన్ని నివారిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వ్యవస్థ కేవలం కొన్ని కిలోమీటర్ల మేరకే అందుబాటులో ఉంది, దీనిని దేశవ్యాప్తం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా రైల్వేవిభాగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయి. పాతబడిన పట్టాల మార్పిడి, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థల ఏర్పాటు, సిబ్బందికి సరైన శిక్షణ అందించడం ద్వారా ఇటువంటి ప్రమాదాలను నివారించగలమని నిపుణులు సూచిస్తున్నారని ‘అవుట్ లుక్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: 2026కు 26 ట్రెండ్స్.. ఏఐ నుంచి జీరో వేస్ట్ వరకూ..


