అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీనే వ్యతిరేకించిన అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ పాలనపైనే వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఆయన పాలనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు సమాచారం.
"నేనేప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు" ఇది ఒక సినిమాలోని ఫేమస్ డైలాగ్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. ఆయన ఎప్పుడు ఏంమాట్లాడుతారో.. ఏదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో.. ఏభూమిని స్వాధీనం చేసుకుంటారో.. ఏ దేశంపై పన్నులు పెంచుతారో ఆయనకే తెలియదు.. అందుకే ట్రంప్ పాలన విధానంపై ప్రపంచ దేశాలు భయంభయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు సీన్ మరింతగా ముదిరింది. ఆయన పాలనపై తాజాగా అమెరికాలోనూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల అమెరికా మిన్నోసోటా రాష్ట్రంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడుల్లో ఇద్దరు మరణించగా అందుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చాలామంది తమ వ్యాపారాలను మూసి వేసి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. విద్యార్థులు సైతం పాఠశాలల నుంచి క్లాసులు వాకౌట్ చేశారు. అంతేకాకుండా నోవర్క్, నోస్కూల్, నోషాపింగ్ పేరుతో అమెరికా అంతటా ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.
దీంతో ట్రంప్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ విధానాన్నే వ్యతరేకించిన అమెరికన్స్ తాజాగా ఆయన పరిపాలన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలోనూ ట్రంప్ పాలనను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడైంది. మెుత్తానికి మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ని చివరకు ఆ దేశ ప్రజల చేతే తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది.


