అమెరికాలో వరుస భూ ప్రకంపనలు | Earthquakes in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో వరుస భూ ప్రకంపనలు

Feb 3 2026 11:39 AM | Updated on Feb 3 2026 2:53 PM

Earthquakes in America

వాషింగ్టన్‌: అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు స్థానికులను వణికించాయి. ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని కాంట్రా కోస్టా కౌంటీలో ఉన్న శాన్ రామన్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది.  దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.

శాన్ రామన్ నగరానికి సుమారు 3 మైళ్ల దూరంలో, భూ అంతర్భాగంలో 8.59 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ జరగలేదు. అయితే శాన్ రామన్, డబ్లిన్ , డాన్‌విల్లే  ప్రాంతాల్లో ప్రజలు స్పష్టమైన ప్రకంపనలను గుర్తించారు. ప్లెజంటన్, కాస్ట్రో వ్యాలీ, హేవర్డ్, లివర్మోర్ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు నివేదికలు అందుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోస్ వంటి ప్రధాన నగరాల్లో ప్రకంపనల ప్రభావం అంతగా కనిపించలేదని సమాచారం.

గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో వరుస భూకంపాలు సంభవిస్తుండటం గమనార్హం. సోమవారం ఉదయం కూడా ఇదే ప్రాంతంలో 4.2 తీవ్రతతో కూడిన ప్రకంపనలు సంభవించాయి. ఆ సమయంలో దాదాపు 25కు పైగా చిన్నపాటి భూకంపాలు (Swarm) నమోదయ్యాయి. ఈ వరుస ప్రకంపనల  కారణంగా బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ రైళ్లను తాత్కాలికంగా నెమ్మదిగా నడిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, వరుసగా భూమి కంపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కాలిఫోర్నియాలో వరుస భూకంపాలు.. ప్రజల్లో భయాందోళన

Advertisement
 
Advertisement
Advertisement