భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తామే చల్లార్చామంటూ చైనా చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. అయితే చైనాకు అంత సీన్ లేదని భారత్ అంటోంది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పుడూ ఒకేరకమైన విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేస్తూ.. డ్రాగన్ కంట్రీ ప్రకటనను తోసిపుచ్చింది.
చైనా ప్రకటనను కేంద్ర వర్గాలు తోసిపుచ్చినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం.. భారతదేశం మధ్యవర్తిత్వంపై ఎప్పటినుంచో స్పష్టమైన వైఖరిని అవలంభిసతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. ఆ తర్వాత ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదు. కేవలం పాకిస్తాన్ DGMO (Director General of Military Operations) భారత్‌ను సంప్రదించి కాల్పుల విరమణ కోరింది. కాబట్టి.. భారత్ ఎప్పటికీ మూడోపక్ష జోక్యాన్ని అనుమతించదు అని పేర్కొన్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ఆపరేషన్ సిందూర్ పేరిట సర్జికల్ స్ట్రయిక్సతో సర్వనాశనం చేసింది. ఈ నేపథ్యంతో మే 7-10వ తేదీల మధ్య ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. రెండు దేశాల సైనిక డీజీఎంవోల సంప్రదింపుల ఫలితంగా సడలిపోయాయని మోదీ సర్కారు ప్రకటించింది. కానీ,
తాజాగా బీజింగ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు వివాదాలను పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా చైనా తన మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించిందని ఆయన వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన టారిఫ్ బెదిరింపులతోనే ఇరు దేశాలు దిగొచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. దీనికి కారకుడంటూ భారతీయ మూలాలున్న తన ప్రత్యేక సహాయకుడు రికీ గిల్‌ను ట్రంప్ ప్రభుత్వం తాజాగా సత్కరించింది కూడా. ఈ పరిణామాల నడుమే.. మే నెల ఉద్రిక్తతల సమయంలో పాక్‌కు ఆయుధాలను సరఫరా చేసిన చైనా ఇప్పుడు మధ్యవర్తిత్వం నడిపి ఉద్రిక్తతలను చల్లార్చామంటూ ప్రకటించుకోవడం కొసమెరుపు.


