సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రసాదంలో నత్త కనిపించిన విషయాన్ని భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో, దేవస్థానం అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం.. దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోకుండా భక్తులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రసాదంపై నత్త వచ్చిందని చెప్పిన భక్తులపైనే తిరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేయడంతో భక్తులపై పోలీసులు కేసు పెట్టారు. భక్తులపై BNS 298, 353 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ప్రసాదం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోకుండగా.. విచారణ చేపట్టకుండా.. భక్తులపై కేసు పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పన్న పులిహోర ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని.. దాని విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండడం దారుణమని మండిపడ్డారు.

🚨 #SaveSimhachalamFromTDP
సింహాచలం ఆలయంలోని ప్రసాదంలో నత్త
హిందూ దేవాలయాల్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం. దాంతో ఆలయాల్లో వరుసగా అపచారాలు, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదాల్లో కీటకాల అవశేషాలు
ఇదేనా @ncbn ఆలయాల ప్రక్షాళన అంటే?#SaveDevoteesFromTDP#APisNotinSafeHands… pic.twitter.com/1Hm7YhOK7O— YSR Congress Party (@YSRCParty) December 30, 2025
ఇక, దేవాలయాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పదేపదే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారని.. జూలైలో భారీ షెడ్ కూలిపోయిందని.. ఇప్పుడు ప్రసాదంలో నత్త కనిపించిందని.. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య తీరే కారణమని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


