భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం లభించింది. పద్నాలుగేళ్లకే ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న ఈ చిచ్చరపిడుగును.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (Pradhan Mantri Rashtriya Bal Puraskar) వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు శుక్రవారం ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.
బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తొలుత దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రంజీల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడి (12)గా రికార్డు సాధించాడు.
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ
అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫు ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడం ద్వారా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట బౌలింగ్ విభాగం ఉన్న జట్టుపై కేవలం 35 బంతుల్లోనే శతకం బాది.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో చిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
భారత అండర్-19 జట్టు తరఫున మెరుపులు
ప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలోనూ యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. ఇటీవల అండర్-19 ఆసియా కప్-2025లోనూ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. తాజాగా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో బిహార్ వైస్ కెప్టెన్‌గా బరిలో దిగిన వైభవ్.. మరోసారి దుమ్ములేపాడు.
అరుణాచల్ ప్రదేశ్‌తో బుధవారం మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా 84 బంతుల్లో 190 పరుగులు సాధించాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగుల మార్కు దాటిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

అత్యున్నత పురస్కారం
ఇలా చిన్న వయసులోనే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీని.. పిల్లలకు అందించే అత్యున్నత పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న వైభవ్.. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతాడు.
VIDEO | Delhi: Young cricketer Vaibhav Suryavanshi conferred with Pradhan Mantri Rashtriya Bal Puraskar.
(Source: Third Party)#VaibhavSuryavanshi
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/JrKqy7ziTN— Press Trust of India (@PTI_News) December 26, 2025
కాగా 5-18 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు సాహసం, సంస్కృతి, వాతావరణం, నవకల్పనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు తదితర విభాగాల్లో ప్రధాన్ మంత్రి బాల్ పురస్కార్ అందజేస్తారు.
టోర్నీ నుంచి అవుట్
భారత అండర్-19 జట్టు తదుపరి జింబాబ్వే పర్యటనతో బిజీ కానుంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జనవరి 15 నుంచి జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మిగిలిన మ్యాచ్‌లకు వైభవ్ సూర్యవంశీ దూరం కానున్నాడు.


