రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో ఆదివారం జార్ఖండ్‌ను ఓడించి చిన్న జట్టు ఉత్తరాఖండ్ తొలి సారి టోర్నీ సెమీస్ చేరగా... తర్వాతి రోజే దేశవాళీ క్రికెట్‌లో మరో చిన్న జట్టు జమ్మూ కశ్మీర్ జట్టు ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేసింది.
67 ఏళ్ల తమ రంజీ చరిత్రలో జమ్మూ కశ్మీర్ మొదటి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 1959–60 సీజన్‌లో తొలి సారి ఈ టోర్నీలో ఆడిన జట్టు ఇన్నేళ్ల తర్వాత సెమీస్ చేరడం విశేషం. సోమవారం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కశ్మీర్ 56 పరుగుల తేడాతో 2021–22 చాంపియన్ మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది.
ఐదేసిన ఆఖిబ్ నబీ
ఇండోర్ వేదికగా 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 87/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన మధ్య ప్రదేశ్.. 68.3 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. సారాంశ్ జైన్ (81 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో పోరాడగా...శుభమ్ శర్మ (32) మాత్రమే ఫర్వాలేదనిపించాడు.
వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (17) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. పేస్ బౌలర్ ఆఖిబ్ నబీ (5/70) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా...ఆబిద్ ముస్తాక్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 12 వికెట్లు పడగొట్టిన ఆఖిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
సెంచరీతో గెలిపించిన రాహుల్...
భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (182 బంతుల్లో 130; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ముందుండి నడిపించగా చిరకాల ప్రత్యర్థి, 42 సార్లు విజేత అయిన ముంబైని ఓడించి కర్నాటక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
ఎనిమిది సార్లు చాంపియన్ కర్నాటక సోమవారం ఆసక్తికరంగా ముగిసిన క్వార్టర్స్ పోరులో 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్ స్కోరు 113/2తో కర్నాటక నాలుగో రోజు ఆట కొనసాగించింది.
కరుణ్ నాయర్ ((13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... రాహుల్, రవిచంద్రన్ స్మరణ్ (123 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. తొలి సెషన్‌లోనే 147 బంతుల్లో రాహుల్ శతకం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతనికి ఇది 24వ సెంచరీ కావడం విశేషం.
లంచ్ తర్వాత కర్నాటక ఇన్నింగ్స్ కొంత తడబాటుకు గురైంది. 19 పరుగుల వ్యవధిలో రాహుల్, శ్రేయస్ గోపాల్ (1), కృతిక్ కృష్ణ (2) అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొద్ది సేపు మైదానంలో వాదనలు కూడా జరిగాయి.
అయితే స్మరణ్, విద్యాధర్ పాటిల్ (30 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును గట్టెక్కింటారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 40 పరుగులు జత చేశారు. ఆదివారం నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఉత్తరాఖండ్‌తో కర్నాటక తలపడుతుంది.


