ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరొక నగరానికి మారడం చాలా మందికి సాధారణమే అయినప్పటికీ, ఆ పరిస్థితి ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసిందంటే మనం నమ్మలేం. దీనిని సంబంధించిన ఉదంతంలోనికి వెళితే.. ముంబై లోకల్ రైళ్ల రద్దీని వదిలి.. ఢిల్లీ మెట్రో సౌకర్యాన్ని ఎంచుకున్న ఒక బ్యాచిలర్, తన తాజా అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.
రెండింతల తృప్తి
ఉద్యోగ రీత్యా ముంబై నుంచి దేశ రాజధాని ఢిల్లీకి షిఫ్ట్ అయిన కారణంగా తనకు డబ్బు ఆదా అవడమే కాకుండా, విశాలమైన నివాసాలు, పరిశుభ్రమైన వాతావరణం లభించడంతో తన తృప్తి రెట్టింపు అయ్యిందని ఆ బ్యాచిలర్ పేర్కొన్నారు. ముంబైతో పోలిస్తే ఢిల్లీలో లభించే సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరింతగా పెరిగిన పొదుపు
నెలకు రూ. 1.4 లక్షల వేతనం పొందుతున్న అతను ముంబైలో ఉన్నప్పుడు ఒక సాధారణ సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కోసం రూ. 40,000 అద్దె చెల్లించేవారు. అంత ఖర్చు చేసినా అక్కడ అంత సౌకర్యవంతంగా ఉండేది కాదని ఆయన తెలిపారు. అయితే తాను ఢిల్లీకి మారిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని ఆయన వివరించారు. ముంబైలో నెలకు రూ. 40 నుంచి 50 వేలు మాత్రమే పొదుపు చేయగలిగిన ఆయన, ఇప్పుడు ఢిల్లీలో అంతకంటే మెరుగైన జీవనశైలిని గడుపుతూ, నెలకు సుమారు రూ. 75,000 ఆదా చేస్తున్నట్లు వెల్లడించారు. విశాలమైన రోడ్లు, సులభంగా లభించే ఇంటి పనివారు, మెరుగైన వైద్య సేవలు ఢిల్లీలో తన ఖర్చులను భారీగా తగ్గించాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వైరల్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ముంబైలో అద్దెలు భరించలేనంతగా ఉన్నాయని ఒకరు వ్యాఖ్యానించగా, ఢిల్లీలోని కాలుష్య సమస్యను మరొకరు గుర్తు చేశారు. ఏడాదిలో మూడు నాలుగు నెలల పాటు ఉండే కాలుష్యాన్ని ఎలాగోలా భరించగలిగితే మిగిలిన విషయాల్లో ఢిల్లీ ఎంతో మెరుగైనదని కొందరు అభిప్రాయపడ్డారు. తరతరాలుగా ఆస్తులు ఉన్నవారికే ముంబై సరిపోతుందని, మధ్యతరగతి, బ్యాచిలర్లకు ఢిల్లీ సరైన ఎంపిక అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘ఢిల్లీ కంటే హైదరాబాద్ బెటర్’
ఈ చర్చలో భాగంగా మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఢిల్లీ కంటే హైదరాబాద్ నగరం ఎంతో ఉత్తమమని ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కు సదరు బ్యాచిలర్ కూడా మద్దతు పలికారు. తాను ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్‌ను సందర్శించానని, భారతదేశంలోని నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. సౌకర్యవంతమైన జీవితానికి హైదరాబాద్ సరైన వేదిక అని ఈ చర్చలో పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: ‘బంగ్లా’పై ట్రంప్ కరుణ.. కీలక రంగానికి సుంకాల ఎత్తివేత!


