ఆకులు, అలములే అతని ఆహారం
దొడ్డబళ్లాపురం( కర్ణాటక): మనిషి జీవించాలంటే ఆహారం తినాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలోని బెళగావికి చెందిన బుడన్‌ఖాన్ అలియాస్ బుడన్ మాలిక్ హొసమణి (25) ఆకులు, చిన్న చిన్న మొక్కలు తింటూ బతుకుతున్నాడు. సవదత్తి తాలూకా ఉగరగోళ గ్రామానికి చెందిన ఇతడు 10 ఏళ్లుగా అన్నం ముట్టుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే గ్రామ శివారులోని హెగ్గొళ్ల గుట్ట మీద ఉంటున్నాడు.
ఆకలైతే చుట్టుపక్కల చెట్ల ఆకులు, మొక్కలు తింటాడు. దాహం వేస్తే కుంటల్లో నీటిని తాగుతాడు. తరచూ ధ్యానం చేస్తాడు. మనుషులు తినే ఎటువంటి ఆహార పదార్థాలనూ ఇతడు తినడు. కోతులు ఆకులు, కాయలు తిని బతకడం చూసి తానూ నేర్చుకున్నానని, ఇప్పటి వరకూ ఎటువంటి రోగాలు రాలేదని చెబుతున్నాడు. ఇతడి ఆహార పద్ధతి వైద్యులకు సవాలుగా మారింది. ఖాన్‌ను అందరూ టార్జాన్ అని ముద్దుగా పిలుస్తున్నారు.


