మెట్రో చార్జీల పెంపును అడ్డుకున్నా
బనశంకరి: కర్ణాటక ప్రభుత్వమే మెట్రో చార్జీల పెంపును అడ్డుకునే నిర్ణయం తీసుకుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేదని డీసీఎం డీకే.శివకుమార్ అన్నారు. సోమవారం విధానసౌధలో ఆయన మాట్లాడుతూ మెట్రో సంస్థలో ఇంధన వ్యయం, నిర్వహణ, పాలనా వ్యయం తెలపాలని అధికారులను కోరానని, అంతవరకు టికెట్ రేట్ల పెంపును నిలిపివేయాలని సూచించానని తెలిపారు. మెట్రో టికెట్ రేట్లపై రాజకీయం అధికమైందన్నారు. సోమవారం జరగాల్సిన బీఎంఆర్‌సీఎల్ (మెట్రో) బోర్డు సమావేశం వాయిదాపడిందన్నారు. మెట్రో 50:50 నిధులతో కొనసాగే పథకమని, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చార్జీల నిర్ణయ కమిటీ ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. గతంలోని కమిటీ రద్దయిందని, కొత్త కమిటీ ఏర్పాయ్యేవరకు చార్జీల్లో జోక్యం చేసుకోరాదని తనకు తెలిసిందని అన్నారు.
బోర్డు సమావేశం రద్దు
యశవంతపుర: మెట్రో చార్జీల పెంపు గురించి చర్చించడానికి బీఎంఆర్‌సీఎల్ బోర్డు భేటీ సోమవారం ఉండగా, ఆకస్మాత్తుగా రద్దయింది. శాంతినగరలోని హెడ్డాఫీసులో జరగాల్సి ఉంది. రద్దు కావడంపై అనేక ఊహాగానాలు వ్యాపించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఇటు నిలబడడంతో మెట్రో పెద్దలకు ఏమీ పాలుపోవడం లేదని సమాచారం.
మెట్రో చార్జీలతో సంబంధం లేదు: సీఎం
సాక్షి, బళ్లారి: మెట్రో రైలు చార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదని, ఇది కేంద్రం నియమించిన మెట్రో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయమని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆయన దావణగెరెలో మాట్లాడుతూ మెట్రో చార్జీల గురించి చర్చించేందుకు డీసీఎం శివకుమార్ ఢిల్లీకి వెళుతున్నారనేది ఆయన్నే అడగాలన్నారు. వాల్మీకి సముదాయానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. దావణగెరె జిల్లా మంత్రి ఎస్‌ఎస్ మల్లికార్జున రాజీనామా చేశారనడంలో నిజం లేదన్నారు. డీకేశి, మీరు కుర్చీని కాపాడుకునేందుకు పైరవీలు చేస్తున్నారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా, సీఎం మండిపడ్డారు.
మెట్రో రైలు చార్జీల రగడ కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధంగా మారింది. పెంపునకు కారణం వారని, తగ్గించింది మాత్రం తామేనని అందరూ ప్రచారం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మెట్రో వార్ మరింత తీవ్రతరమైనా ఆశ్చర్యం లేదు.
డీసీఎం డీకే శివకుమార్


