బనశంకరి: బనశంకరీదేవీ ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం బనశంకరీదేవీ మూలవిరాట్‌కు అభిషేకం, అర్చనలు చేపట్టి పూలతో విశేషంగా అలంకరణచేసి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధనచేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు.
లోకాయుక్తకు చిక్కిన జైలర్
బనశంకరి: ఖైదీ నుంచి లంచం డిమాండ్ చేసిన సబ్ జైలు జైలర్ లోకాయుక్తకు చిక్కాడు. ఈఘటన ఉత్తరకన్నడ జిల్లా హుళియాళలో చోటుచేసుకుంది. హళియాళ సబ్ జైలులో రాజ్‌కుమార్ అనే ఖైదీ రెండేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. రాజ్‌కుమార్ జైలులో చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక పర్యాయం రూ.1.34 లక్షలు, మరో పర్యాయం రూ.45 వేలు విడుదలైంది. ఈ నగదు ఇవ్వడానికి జైలర్ కల్లప్పగస్తీ రూ.60వేలు డిమాండ్ చేశాడు. తొలుత రూ.10 వేలు వేరే వ్యక్తి పేరుతో ఫోన్‌పే చేయించుకున్నాడు. మిగిలిన నగదు కోసం ఒత్తిడి చేయడంతో ఫిర్యాదుదారుడు తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కార్వార లోకాయుక్త డీఎస్పీ దన్యానాయక్, సీఐ వినాయక్‌బిల్లవ నేతృత్వంలో శుక్రవారం దాడిచేశారు. కల్లప్పగస్తీ ఫోన్‌పే ద్వారా నగదు జమచేయించుకోవడం రుజువైన నేపథ్యంలో ఆయన్ను బెళగావిజైలుకు బదిలీచేశారు.
బైకుపై మద్యంబాటిల్‌తో యువతి జాలీరైడ్
బనశంకరి: హెల్మెట్ ధరించకుండా ఓ యువతి గురువారం రాత్రి చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని జాలీరైడ్ చేసింది. బనశంకరి నుంచి బీటీఎం లేఔట్ వైపునకు ఆ యువతి బైకులో బయలుదేరింది. ఆ సమయంలో బైకు వెనుక కూర్చుని సినిమా ఫక్కీలో మద్యం బాటిల్‌ను పట్టుకుని హెల్మెట్ లేకుండా సుమారు 4–5 కిలోమీటర్లు మద్యం తాగుతూ బైకుపై ప్రయాణించింది. వెనుక కారులో వెళుతున్నవారు ఆ యువతి హంగామా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది.
అసెంబ్లీలో ఇకపై కాగిత రహిత సమావేశాలు
● స్పీకర్ యూటీ ఖాదర్
దొడ్డబళ్లాపురం: కర్ణాటక అసెంబ్లీలో ఇకపై సమావేశాలు పేపర్‌లెస్‌గా నడుస్తాయని స్పీకర్ యూటీ ఖాదర్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేస్తామని ఖాదర్ ప్రకటించారు. ఈఽ విధానంతో ఎమ్మెల్యేలకు తక్షణం డిజిటల్ రూపంలో సమావేశాల సమాచారం లభిస్తుంది. గత పదేళ్లుగా ఈ విధానం అమలు చేయాలని అనుకుంటున్నా కార్యరూపం దాల్చలేదు. ఈ–విధానం కేంద్రప్రభుత్వం సహభాగత్వంతో అమలవుతుంది. 2014లోనే ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలు కావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది. టెక్నాలజీ, ఆర్థిక అభివృద్ధిలో ఎంతో ముందు ఉన్న కర్ణాటకలో ఇంకా ఈ విధానం అమలు కాకపోవడం విచారకరం.
మాజీ లోకాయుక్త
సంతోష్ హెగ్డేకి అస్వస్థత
● వేదిక మీదే కుప్పకూలిన వైనం
దొడ్డబళ్లాపురం: మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరు మహారాణి కళాశాల వద్ద ఉన్న కొండజ్జి బసప్ప ఆడిటోరియంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కుప్పకూలి పడిపోయారు. తక్షణం ఆయనను మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. లోషుగర్ కావడంతో పాటు స్వల్పంగా గుండెపోటు వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స అందుతోంది.


