గ్యాస్‌ కొరతతో ఆటోడ్రైవర్లు డీలా | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరతతో ఆటోడ్రైవర్లు డీలా

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

బనశంకరి: పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఆటోల సంచారంపై కూడా పడింది. బెంగళూరు నగరంలో సుమారు 2 లక్షలకు పైగా ఆటోలు సంచరిస్తుండగా గ్యాస్‌ కొరతతో ఇప్పటికే లక్షకు పైగా ఆటోలు షెడ్‌కు చేరాయి. గ్యాస్‌ లభించక పోవడంతో చాలా ఆటోలను రోడ్లుపై నడపలేక ఇళ్ల ముందు ఆటోడ్రైవర్లు నిలిపివేశారు. గ్యాస్‌ కొరతతో నగరంలోని అనేక ఆటోగ్యాస్‌ బంకుల్లో రోజుల తరబడి బారులు తీరిన ఆటోడ్రైవర్లకు అనేక చోట్ల నోస్టాక్‌ బోర్డు మాత్రమే కనబడుతోంది. గ్యాస్‌ సమస్యతో నగరంలో ఆటోసంచారం 50 శాతానికి పడిపోయింది. దీంతో ప్రజలు బీఎంటీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఆటోల కొరతతో సాధారణ ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందుల్లో పడ్డారు. ఆటోలకు రుణ కంతులు కట్టి జీవించడం కష్టతరంగా మారింది. పిల్లల స్కూల్‌ ఫీజులు చెల్లించడం సాధ్యం కావడం లేదు. సమస్య ఇలాగే కొనసాగితే ఆటోడ్రైవర్ల బతుకు అధ్వానంగా మారే అవకాశం ఉంది. రోజువారి ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితి ఏర్పడటంతో అనేక మంది ఆటోడ్రైవర్లు ఆటోలు వదిలిపెట్టి వేరే పనులకు వెళుతున్నారు. ఈ సమస్యపై జిల్లా అధికార యంత్రాంగం లేదా ప్రభుత్వం తగిన స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఆటోడ్రైవర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదల, గ్యాస్‌ కొరతతో జీవించడం కష్టతరంగా మారుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement