రన్‌వే మీద ప్రచార బెలూన్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో రన్‌వే పైకి ఓ ప్రైవేటు సంస్థ ప్రచార బెలూన్ ఎగురుకుంటూ రావడంతో కాసేపు కలకలం రేగింది. ఆ భారీ సైజు బెలూన్ రన్‌వే పైన పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో విమానాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది బెలూన్‌ను తొలగించారు. ఓ రియాల్టీ సంస్థ బెలూన్‌గా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇద్దరికి రూ.15 లక్షల
సైబర్ మోసం
మైసూరు: ప్యాలెస్ సిటీలో సైబర్ మోసగాళ్లు అమాయకులకు ఇట్టే బురిడి వేస్తున్నారు. వివరాలు.. యరగనహళ్లి నివాసికి వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్ గురించి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అతడు ఆ నంబరుకు కాల్‌చేసి మాట్లాడాడు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే లాభాలంటూ అతన్ని మోసగాడు నమ్మించాడు. అలా రూ.3.50 లక్షలు బదిలీ చేసి మోసపోయాడు. సరస్వతిపురంలో ఓ రిటైర్డ్ అధికారిని ముంబై పోలీసులమని కాల్ చేసి బెదిరించారు. నీకు పలు నేరాలతో సంబంధం ఉందని భయపెట్టారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు తీసుకుని రూ. 12 లక్షలను బదిలీ చేసుకున్నారు.
రెండు కార్లు ఢీ, ఇద్దరు మృతి
తుమకూరు: తాలూకాలోని బనవర గేట్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మృతులను తుమకూరు నగరవాసులు సురేష్ (55), మురళి (60)గా గుర్తించారు. ఎదురెదురుగా వస్తున్న కారు, క్వాలిస్ వాహనం ఢీకొన్నాయి. కారులో పై ఇద్దరూ తీవ్ర గాయాలతో చనిపోయారు. క్వాలిస్‌లోని సైబర్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణప్ప, జేడీఎస్ నేత జయన్న, మంజునాథ్ తదితరులు గాయపడ్డారు.
చైన్ స్నాచర్ల దాడి..
మహిళ దుర్మరణం
దొడ్డబళ్లాపురం: కళ్లల్లో స్ప్రే కొట్టిన చైన్ స్నాచర్‌లు మహిళ మెడలోని బంగారు గొలుసు లాగడంతో కిందపడి గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. చైన్‌స్నాచర్ల దుష్కృత్యానికి ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాలు.. నెలమంగల తాలూకా హుస్కూరు గ్రామంలో జరిగింది. గ్రామ నివాసి జ్యోతి (45) సోమవారం ఉదయం ఇంటిముందు చెత్త ఊడుస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె కళ్లల్లో ఏదో స్ప్రే కొట్టారు. తరువాత మెడలోని గొలుసు తెంచుకుని పరారయ్యారు. గొలుసు లాగడంతో ఆమె కిందపడినప్పుడు తలకు గాయం తగిలి స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కొంతసేపటికే చనిపోయింది. మాదనాయకనహళ్లి పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
భార్య తెలివికి.. భర్త జైలుకు
● అతనితో హత్య చేయించిన వైనం
● ఆపై ప్రియునితో జీవనం
బొమ్మనహళ్లి: అక్రమ సంబంధాల మోజులో పడిన భార్య.. భర్తను వదిలించుకోవాలని షాకింగ్ పథకం వేసింది. అతన్ని హంతకున్ని చేయాలని కుట్ర చేసింది. ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో జరిగింది. భార్య కుట్ర ఫలితంగా భర్త జైలు పాలయ్యాడు. వివరాలు.. ఆనేకల్ తాలూకాలో ఆంథోనీ, రోజి భార్యాభర్తలు. రోజికి రాజేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త ఆమెను మందలించేవాడు. తమ సంతోషానికి భర్త అడ్డంకిగా ఉన్నాడు, తరచూ తాగి వచ్చి వేధిస్తున్నాడనే నెపంతో భార్య తన భర్తను పునరావాస కేంద్రంలో చేర్పించింది. 18 నెలల తర్వాత, భర్త ఆంథోనీ తిరిగి వచ్చాడు. భర్త లేని సమయంలో ఆమె ప్రియునితో సహజీవనం సాగించింది. భర్త రాగానే పథకాన్ని అమలు చేసింది. తమ బావ బాలరాజు మీద లేనిపోని మాటలు చెప్పి చంపేయాలని ప్రేరేపించింది. భార్య మాట విని ఆంథోనీ, తన అన్నయ్య బాలరాజ్‌ను కత్తితోపొడిచి హత్య చేశాడు. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఆంథోనీపై కేసు నమోదైంది. అరెస్టు చేసి చెరసాలకు తరలించారు. రోజి మళ్లీ ప్రియునికి దగ్గరైంది. అయితే రోజినే అసలు నిందితురాలని తెలిసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
రన్‌వే మీద ప్రచార బెలూన్
రన్‌వే మీద ప్రచార బెలూన్
రన్‌వే మీద ప్రచార బెలూన్


