హొసపేటె: చారిత్రక ప్రసిద్ధి గాంచిన రాయల రాజధాని హంపీలో కొలువైన విరుపాక్షేశ్వర స్వామి, చంద్రమౌళేశ్వర స్వామి వార్ల జంట రథోత్సవం గురువారం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. రథోత్సవం సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం సందర్భంలో విరుపాక్షేశ్వర స్వామికి సమర్పించిన రత్నఖచిత స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగర రాజవంశానికి చెందిన శ్రీ కృష్ణదేవరాయలు, ఏటా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం ప్రకారం విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి వారికి పట్టాభిషేకం చేశారు.
ఆలయంలో మూలవిరాట్టుకు పూజలు
అనంతరం రాజవస్త్రాలు ధరించిన విద్యారణ్య పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వారు, శ్రీకృష్ణదేవరాయలు విరుపాక్షేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఉదయం ఆలయంలో విరుపాక్షేశ్వర స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి విజయనగర రాజులు సమర్పించిన రత్నఖచిత కిరీటాన్ని స్వామి వారికి అలంకరించి, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు, అలాగే విదేశీ పర్యాటకులు ఈ చారిత్రక బ్రహ్మరథోత్సవాన్ని వీక్షించారు. హంపీ రథోత్సవం శోభ ఉట్టిపడేలా విరుపాక్షేశ్వర స్వామి వారి మూలవిరాట్టుకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని అలంకరించారు.
సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం
తాలూకాలోని కమలాపురం సమీపంలో ఉన్న హెచ్‌పీసీ క్యాంపులో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి వారికి పంచామృతాభిషేకం, కుంకుమ అర్చన తదితర విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని పూలమాలలతో అలంకరించారు. మహిళలు తలపై పూర్ణ కుంభాలు ధరించి భక్తిని చాటుకున్నారు. సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పల్లకీలో మోసుకెళ్లి రథం చుట్టు మూడు ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం రథంలో కూర్చోబెట్టి రథాన్ని లాగారు. హెచ్‌పీసీ కాలనీ వాసులతో పాటు కమలాపురం, కడ్డిరాంపురం తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు.
విరుపాక్షేశ్వరుని దర్శించుకున్న వేలాది భక్తులు
భక్తులతో కిటకిటలాడిన విజయనగర రాజధాని


