సాక్షి,బళ్లారి: ప్రపంచానికి శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తూ, కోట్లాది మంది భక్తులచే పూజలందుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి జన్మించిన పవిత్ర పుణ్యస్థలమైన ఆంజనాద్రి భక్తులతో కిటకిటలాడింది. గురువారం శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొప్పళ జిల్లా గంగావతి సమీపంలో శ్రీ అంజనాద్రి కొండలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు అంజనాద్రిలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొండపైకెక్కి శ్రీ హనుమాన్‌ను దర్శించుకున్నారు. కర్ణాటక ప్రాంతం నుంచే కాకుండా దేశంలో పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తజన సందోహం తరలివచ్చింది. అంజనాద్రిలో ఎటు చూసినా కాషాయ కండువాలు వేసుకుని భక్తిని చాటారు. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జై హనుమాన్ అంటూ అంజనాద్రి శ్రీ ఆంజనేయ స్వామి నామంతో మార్మోగిపోయింది. అలాగే బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా శ్రీ హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉదయం ఉంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, అర్చనలు, ప్రసాదాలు చేస్తూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.
రాయచూరు జిల్లాలో...
రాయచూరు రూరల్: జిల్లాలో హనుమాన్ జయంతిని ఘనంగా ఆచరించారు. గురువారం నగరంలోని ఐబీ రహదారిలో వెలసిన వర సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ప్రత్యేక అలంకరణలో హనుమంతుడికి పూజలు చేశారు. భక్తులు ఊయల సేవతో పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఉత్సవంలో పాల్గొన్న స్వామీజీ, మాజీ ఎమ్మెల్యే
నగరంలోని వీరాంజనేయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో కిల్లే బృహన్మఠం అధిపతి శాంతమల్ల శివాచార్య, మాజీ శానన సభ్యుడు పాపారెడ్డి, శానన సభ్యుడు శివరాజ్ పాటిల్ పాల్గొని హనుమంతుడికి పూజలు చేశారు. ప్రభుత్వ ఉద్యానవనంలో బగచి హనుమాన్ దేవాలయంలో అర్చకుడు నరేంద్ర భక్తులకు పూజలు జరిపి అన్న ప్రసాదం చేశారు. బసవన బావి చౌక్‌లోని ఆలయంలో హిందూ జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో గదకు పూజలు జరిపి భక్తులకు అన్న సంతర్పణ గావించారు.
విజయనగరలో..
హొసపేటె: భజరంగబలి, పవనపుత్ర, ఆంజనేయ స్వామి, హనుమాన్ జయంతిని నగరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని మెయిన్ బజారులో ఉన్న వడకరాయ దేవస్థానంలో జయంతిని పురస్కరించుకుని పిల్లలు, యువకులు, పెద్దలు, వృద్ధులు సుమారు 2 గంటల పాటు హనుమాన్ ఛాలీసా పఠనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. హనుమాన్ ఆలయాల్లో ముఖ్యంగా కొప్పళ జిల్లాలోని అంజనాద్రిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
భక్తులతో పోటెత్తిన ఆంజనేయ స్వామి ఆలయాలు
అంజనాద్రికి భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం


