రాయచూరు రూరల్ : గంజాయిని విక్రయించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ అరుణాంగ్శుగిరి వెల్లడించారు. గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం లింగసూగూరు తాలూకా హట్టి ఫిర్కాలోని రోడలబండ వద్ద బసవరాజ్ పొలంలో సంచిలో భద్రపరిచిన 280 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేశామన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముగ్గురిపై బెట్టింగ్ కేసు
హుబ్లీ: కార్వార రోడ్డులోని షెల్ప్ పెట్రోల్ బంక్, సంతోష్ నగర్ చెరువు వద్ద బెట్టింగ్ వ్యవహారంలో పాల్గొన్న ముగ్గురిపై పాత హుబ్లీ, అశోక్‌నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు వెయ్యికి వెయ్యి ఇస్తామంటూ బెట్టింగ్ దందా నిర్వహించారని పోలీసులు తెలిపారు. కాగా మరో ఘటనలో రూ.లక్ష విలువ చేసే వస్తువులు చోరీకి గురయ్యాయి. విద్యానగర లోకప్పన అక్కళలో దైవజ్ఞ కళ్యాణ మంటపం వద్ద సునీల్ బెటగేరి అంగట్లో దొంగలు ల్యాప్‌టాప్, మొబైల్ తదితర వస్తువులను చోరీ చేశారు.
ఘనంగా వీరభద్రేశ్వర జాతర
రాయచూరు రూరల్: జిల్లాలోని హిరే హంచినాళలో వెలసిన వీరభద్రేశ్వరాలయం వద్ద వీరభద్రేశ్వర జాతర ఉత్సవాలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఆలయం వద్ద నుంచి మహిళలు కుంభ కలశాలతో ఊరేగించారు. గదగ్ బెటగేరిలకు చెందిన పురవంతులు వీర గాసె నృత్యం చేస్తూ ఒడుపులు చెబుతూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం దీపోత్సవాన్ని భక్తులు ప్రజ్వలన చేశారు. గురువారం తెల్లవారు జామున భక్తులు అగ్నిగుండంలో నడిచారు.
మజ్జిగ, మంచినీటి పంపిణీ భేష్
సాక్షి,బళ్లారి: రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఎండల వేడిమికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, మధ్యాహ్నం వేళల్లో రోడ్లలో వెళ్లేవారికి అక్కడక్కడ చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన నగరంలోని 11వ వార్డు కార్పొరేటర్ నామాల గోవిందరాజులు ఆధ్వర్యంలో బ్రూస్‌పేట పోలీసు స్టేషన్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిసిల బళ్లారిగా పేరొందిన గనినాడులో ఎండల తీవ్రతను తట్టుకునేందుకు చల్లని పానీయాలు దోహదపడతాయన్నారు. ఎండల బారి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ సుధాకర్ దేశాయి, ప్రముఖులు రమేష్ బుజ్జి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
రాయచూరు రూరల్ : బెళగావితో పాటు మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన కేసుల్లో ఏడుగురు అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు బెళగావి జిల్లా ఎస్పీ వెల్లడించారు. గురువారం హారూగేరి పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బెళగావితో పాటు గోవా, మహారాష్ట్రల్లో చోరీ చేసిన నిందితుల నుంచి రూ.36.11 లక్షల విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. రవి సిందే(30), సునీల్ పవార్(26), శంకర్ జాధవ్(30), దిలీప్ సిందే(26), కిశోర్ మోరె(26), వినోద్ సిందే(26), మిథున్ జాధవ్(30)లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బంగారు నగలను జప్తు చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం నలుగురు దొరికారని, మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
అకాల వర్షాలతో పంట నష్టం
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో అకాల వర్షాలతో మొత్తం 1980 హెక్టార్ల మేర ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లాధికారిణి ఆర్.స్నేహల్ తెలిపారు. జెడ్పీ మీటింగ్ హాల్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్ అధ్యక్షతన జరిగిన జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సమావేశంలో ఈ మేరకు ఆమె వివరాలను వెల్లడించారు. అకాల వర్షాలతో పాటు వడగళ్ల వల్ల కలఘటిగి తాలూకాలో 1315.07 హెక్టార్లలో చెరకు, 149.64 హెక్టార్లలో సోయాబీన్, 243.18 హెక్టార్లలో మొక్కజొన్న, 66.20 హెక్టార్లలో జొన్న పంటకు హాని వాటిల్లింది. 18.21 హెక్టార్లలో పెసలు, 121.85 హెక్టార్లలో మామిడి, 20.31 హెక్టార్లలో అరటి పంటకు నష్టం జరిగిందని జిల్లాధికారిణి తెలిపారు.


