విరాట్ కోహ్లి (PC: PTI)
టీమిండియా దిగ్గజ బ్యాటర్, ఢిల్లీ స్టార్ విరాట్ కోహ్లి శతకం చేజార్చుకున్నాడు. మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సెంచరీకి ఇరవై మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి కోహ్లి దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగిన విషయం తెలిసిందే. రోహిత్ తన సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. కోహ్లి సైతం తన జట్టు ఢిల్లీకి ఆడుతున్నాడు.
ఆంధ్రపై శతక్కొట్టిన కోహ్లి..
ఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్రపై శతక్కొట్టిన (101 బంతుల్లో 131) కోహ్లి.. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాడు. ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా బెంగళూరు వేదికగా గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
29 బంతుల్లోనే
అయితే, ఆదిలోనే గుజరాత్ బౌలర్లు ఢిల్లీని దెబ్బకొట్టారు. ప్రియాన్ష్ ఆర్య (7 బంతుల్లో 1)ను కెప్టెన్ చింతన్ గజా వెనక్కి పంపగా.. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే మరో ఓపెనర్ అర్పిత్ రాణా (31 బంతుల్లో 10)ను విశాల్ జైస్వాల్ అవుట్ చేయగా.. కోహ్లి బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు.
మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న కోహ్లి.. తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. మొత్తంగా 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 77 పరుగులు సాధించాడు. అయితే, విశాల్ జైస్వాల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
మిగతా వారిలో నితీశ్ రాణా (12) తేలిపోగా.. కెప్టెన్ రిషభ్ పంత్, ఆయుశ్ బదోనిలపై భారం పడింది. 27 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి ఢిల్లీ 129 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. గత ఐదు మ్యాచ్‌లలో కోహ్లి మూడు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.
పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తొలి, రెండో మ్యాచ్‌లలో శతక్కొట్టిన కోహ్లి.. ఢిల్లీ తరఫు పునరాగమనంలోనూ సెంచరీతో అలరించాడు. కింగ్ ఫామ్ చూసి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో.. ‘‘సంతోషం పట్టలేకపోతున్నాం.. పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా బెంగళూరులో కోహ్లి ఆటను చూసేందుకు ఫ్యాన్స్ చెట్లెక్కి మరీ విన్యాసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే.


