దేశవాళీ బరిలో రోహిత్- కోహ్లి (PC: BCCI)
టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు టీమిండియా విధుల్లో లేని స్టార్లంతా దేశవాళీ క్రికెట్ బాట పట్టిన విషయం తెలిసిందే.
దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తమకు తిరుగులేదని నిరూపించుకున్న ఈ ఇద్దరు.. సొంత జట్ల తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగారు. ముంబై ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు వన్‌డౌన్ బ్యాటర్‌గా కోహ్లి బుధవారం దర్శనమిచ్చారు.
62 బంతుల్లోనే శతక్కొట్టి..
ఇక తమ తొలి మ్యాచ్‌లో ముంబై సిక్కిం వంటి పసికూనతో తలపడగా.. రోహిత్ శర్మ కేవలం 62 బంతుల్లోనే శతక్కొట్టి.. తన లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 18 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 155 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు.
ఇప్పుడు గోల్డెన్ డక్!
తాజాగా గ్రూప్-సిలో భాగంగా ఉత్తరాఖండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగ్‌మోహన్ నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
దీంతో జైపూర్‌లో మొన్న (బుధవారం) రోహిత్ శర్మ సెంచరీ చూసిన అభిమానులు.. ఇప్పుడు అదే వేదికపై అతడు ఇలా తేలిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఆంధ్రతో మ్యాచ్‌లో కోహ్లి సైతం శతక్కొట్టిన విషయం తెలిసిందే.
చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్
#VijayHazareTrophy
Golden duck for rohit sharma pic.twitter.com/mwsH4O7aRt— vaibhav dhakad (@Pkmbk123) December 26, 2025


