న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు.
దాదాపు రెండు నెలల విరామం తర్వాత అయ్యర్ బుధవారం(డిసెంబర్ 24) తన మొదటి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోన్నట్లు సమాచారం. సుమారు గంటసేపు నెట్స్‌లో గడిపిన శ్రేయస్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అతడు ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. శ్రేయస్ ఒకట్రెండు రోజుల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ ముంబై ఆటగాడు 4 నుంచి 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గోనున్నాడు.
అనంతరం అతడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృంది ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది. ఒకవేళ ఈ పరీక్షలో అయ్యర్ పాసైతే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది. కివీస్‌తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు.
అయ్యర్‌కు ఏమైందంటే?
అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు.
మూడు రోజుల తర్వాత అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకు తిరిగొచ్చిన అయ్యర్.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. అతడికి దాదాపు నాలుగు ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని పార్దివాలా సూచించారు.
ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకోవడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఒకవేళ అయ్యర్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే.. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
చదవండి: ఐపీఎల్ వద్దు పొమ్మంది.. కట్‌చేస్తే.. డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు!


