అండర్ 19 ప్రపంచకప్ 2026 విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన యువ భారత జట్టుకు రూ. 7.50 కోట్ల భారీ నగదు బహుమతిని అనౌన్స్ చేసింది. హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ (80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు) ఆడి భారత్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. జట్టుగానూ భారత్ పలు రికార్డులు సొంతం చేసుకుంది.
దేశమంతా గర్విస్తుంది
జగజ్జేత భారత్‌కు నగదు బహుమతి ప్రకటిస్తున్న సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. మా అండర్ 19 జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచినందుకు దేశమంతా గర్విస్తోంది. ఇంగ్లండ్‌పై ఫైనల్లో చూపిన ప్రదర్శన, టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఆడిన తీరు అద్భుతం. ఈ విజయానికి గుర్తుగా రూ. 7.50 కోట్ల బహుమతి అందజేస్తున్నామని అన్నారు.
ప్రధాని అభినందనలు
ఆరోసారి ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు. భారత క్రికెట్ ప్రతిభ మరోసారి వెలుగొందింది. అండర్ 19 జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచి దేశానికి గర్వకారణమైంది. ఈ విజయం అనేక యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
ఆరోసారి
తాజా టైటిల్‌తో భారత్ ఆరోసారి అండర్ 19 వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. గతంలో భారత్ 2000, 2008, 2012, 2018, 2022 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.
కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. భారత ఇన్నింగ్స్‌లో వైభవ్ విధ్వంసకర భారీ శతకాన్ని నమోదు చేయగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (53) అర్ద సెంచరీతో రాణించాడు.
అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.


