ఇండియన్ ప్రీమియర్ లీగ్.. యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్‌లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు.
అలా కలలు కంటున్న వారిలో ఒడిశాకు చెందిన స్వస్తిక్ సామల్ ఒకరు. 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్‌లో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతీసారి అతడికి నిరాశే ఎదురు అవుతోంది. ఐపీఎల్-2026 మినీ వేలంలో కూడా అతడు తన పేరును రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు.
అయితే దురదృష్టవశాత్తూ తుది వేలం జాబితాలో (369 మంది) అతడికి చోటు దక్కలేదు. కానీ అతడు కొంచెం కూడా దిగులు చెందలేదు. తన సత్తాను మైదానంలోనే చూపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టు ఏకంగా డబుల్ సెంచరీతో మెరిశాడు.
డబుల్ సెంచరీతో వీర వీహారం..
విజయ్ హాజారే ట్రోఫీ-2025లో భాగంగా అలూర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో స్వస్తిక్ సామల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సామల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అలూర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 169 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 212 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది.
అయితే ఈ లక్ష్యాన్ని సౌరాష్ట్ర 5 వికెట్లు కోల్పోయి చేధించేసింది. ఒడిశా ఓడిపోయినప్పటికి స్వస్తిక్ సామల్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఒడిశా ప్లేయర్‌గా స్వస్తిక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఐదవ ఆటగాడిగా ఏకంగా సంజూ శాంసన్ (212*) రికార్డును సమం చేశాడు. దీంతో సామల్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిచూపుతున్నారు.
ఎవరీ సమాల్?
25 ఏళ్ల స్వస్తిక్ సామల్.. ఒడిశాలోని కోరాపుట్‌లో జన్మించాడు. అయితే అతడికి చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కవ. 10 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఆ తర్వాత స్ధానికంగా ఓ క్రికెట్ అకాడమీలో అతడు చేరాడు.
అనంతరం ఒడిశా అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అతడికి 2019లో ఒడిశా సీనియర్ జట్టు తరపున ఆడే అవకాశముంది. తొలుత అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మిజోరంపై టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది లిస్ట్-ఎ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
టీ20, లిస్ట్-ఎలో అద్భుతంగా రాణించడంలో అతడు రెండేళ్ల కిందట ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పుడు ఒడిశా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఓపెనర్‌గా వచ్చి దూకుడగా ఆడడం అతడి స్పెషాలిటి.
ముఖ్యంగా టీ20 టీ20 ఫార్మాట్‌లో పవర్ ప్లే ఓవర్లను అద్భుతంగా ఉపయోగించుకునే సత్తా అతడికి ఉంది. గ్రౌండ్ నలుమూలలా కూడా అతడు షాట్లు ఆడగలడు. స్వస్తిక్ సామల్ అండర్-16, అండర్-19 ,అండర్-23 స్థాయిలలో ఒడిశా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతడు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 686 పరుగులతో పాటు లిస్ట్-ఎ క్రికెట్‌లో 521 రన్స్ నమోదు చేశాడు. అదేవిధంగా టీ20ల్లో 13 మ్యాచ్‌లు 362 పరుగులు చేశాడు. అయితే మూడు ఫార్మాట్లలోనూ అతడి పేరిట సెంచరీ ఉంది.


