సాక్షి, హైదరాబాద్: నైనీ బొగ్గు టెండర్ల వ్యవహారంపై విచారణ మొదలైంది. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని సింగరేణి కార్యాలయానికి వెళ్లిన కేంద్ర బృందం.. సుమారు ఏడు గంటలకు పైగా విచారణ జరిపారు. విచారణ గోప్యంగా జరిగినప్పటికీ.. ఆ వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. టెక్నికల్ కమిటీ సభ్యులు అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఇవాళ సింగరేణి కార్యాలయానికి మరోసారి వెళ్లనున్న సెంట్రల్ టీం.. మరోసారి అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మొన్న, నిన్నటి విచారణలో సీఎండీ కృష్ణ భాస్కర్‌తో పాటు కొందరు అధికారులను విచారించారు. పలు కీలకమైన ఫైల్స్‌ను పరిశీలించారు. ప్ఱధానంగా సీఎస్‌ఆర్ ఫండ్స్ వినియోగంపై ప్రశ్నల వర్షం గుప్పించినట్లు తెలుస్తోంది. సోమవారం ఈ అంశంపై కేంద్రానికి సెంట్రల్ టీం నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే దర్యాప్తును పరుగులు పెట్టిస్తున్నట్లు స్పష్టమౌతోంది.
అసలు ఏంటీ వివాదం
ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లా నైనీ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిని గతంలో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ గనిలో తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తి పనులను ఇతర సంస్థలకు అప్పగించేందుకు ‘మైన్ డెవలపర్, ఆపరేటర్’(ఎండీఓ) ఎంపిక కోసం టెండర్లను ఆహ్వానిస్తూ గత నవంబరులో సింగరేణి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29లోగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో టెండర్లు వేయాలని గడువు విధించింది.
ఈ నోటిఫికేషన్‌లో గని నేపథ్యం(బ్యాక్‌గ్రౌండ్) వివరాలు తెలిపిన అంశాల్లో ఒకటో విభాగంలోని 1.8 నిబంధన ప్రకారం... నైనీకి వెళ్లి, గని తవ్వాల్సిన ప్రాంతాన్ని సందర్శించి, అన్ని వివరాలు తెలుసుకున్నట్లు అక్కడి సింగరేణి జనరల్ మేనేజర్(జీఎం) నుంచి ‘ధ్రువీకరణ పత్రం’ తీసుకుని టెండర్‌తో పాటు తప్పనిసరిగా దాఖలు చేయాలి. అయితే, తాము గనిని సందర్శించినా అక్కడి జీఎం సర్టిఫికెట్ ఇవ్వలేదని కొన్ని కంపెనీలు ఆరోపించడంతో వివాదం తలెత్తింది.
ఈ నేపథ్యంలో గని తవ్వకాలకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లయ్యింది. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకుల సిఫార్సులతో సింగరేణి నుంచి సీఎస్‌ఆర్ నిధులను మంజూరు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరోపక్క.. సింగరేణి సంస్థ వ్యవహారాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నడుం బిగించింది. టెండరు ప్రకటన రద్దుకు దారితీసిన పరిస్థితులతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద నిధుల వినియోగం జరిగిన తీరుపై విచారణకు ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బొగ్గుశాఖలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ)గా పనిచేస్తున్న చేతన్ శుక్లా, సాంకేతిక విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న మారపల్లి వెంకటేశ్వర్లును విచారణ కమిటీ సభ్యులుగా నియమించింది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశంతోనే కమిటీని ఏర్పాటు చేసినట్లు తన ఉత్తర్వుల్లో తెలిపింది.
వాస్తవానికి సింగరేణి ప్రధాన కార్యాలయం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఉంది. పాలకమండలి సమావేశాలను మాత్రమే హైదరాబాద్ కార్యాలయంలో నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో నైనీతోపాటు సీఎస్‌ఆర్ నిధుల మంజూరు, వినియోగానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలను వెంటనే తమ ముందు పెట్టాలని సింగరేణి అధికారులను కమిటీ సభ్యులు కోరారు. దీంతో.. కమిటీ అడిగిన వాటిని తెప్పించే పనిలో సింగరేణి యంత్రాంగం తలమునకలైంది.


