Urvil Patel
-
IPL 2025: అంతా అయిపోయాక విధ్వంసకర వీరుడికి పిలుపునిచ్చిన సీఎస్కే..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్లో సీఎస్కే వరుసగా రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరకుండా నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించింది. ఏ జట్టు ఓడని విధంగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది.సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన తర్వాత ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌ల కోసం సీఎస్కే యాజమాన్యం ఓ విధ్వంసకర వీరుడిని ట్రయల్స్‌కు పిలిచినట్లు సమాచారం. సీఎస్కే మేనేజ్మెంట్ గుజరాత్‌కు చెందిన ఉర్విల్ పటేల్‌ను మిడ్ సీజన్ ట్రయల్స్‌కు పిలిచినట్లు ఓ భారత మాజీ ఆటగాడు చెప్పాడు.ఉర్విల్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో (టీ20) 28 బంతుల్లోనే (త్రిపురపై) సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. సాహిత్ గతేడాది సైప్రస్‌పై 27 బంతుల్లోనే శతకొట్టాడు.26 ఏళ్ల ఉర్విల్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. ఇతనికి దేశవాలీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 అర్ద సెంచరీలు.. 22 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు.. 47 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు.ఉర్విల్‌ను సీఎస్కే మేనేజ్మెంట్ తదుపరి సీజన్ ప్రణాళికల్లో భాగంగా ట్రయల్స్‌కు పిలిచినట్లు తెలుస్తుంది. ధోని వచ్చే సీజన్లో రిటైర్ అవుతాడని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా ఉర్విల్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తుంది.ఉర్విల్ ఈ సీజన్ మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు (30 లక్షల విభాగంలో). అయినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. సీఎస్కేకు ఉర్విల్‌పై ముందు నుంచే కన్ను ఉన్నప్పటికీ ఎందుకో అతన్ని రుతురాజ్‌కు ప్రత్యామ్నాయంగా కూడా ఎంపిక చేసుకోలేదు. రుతురాజ్‌కు ప్రత్యామ్నాయంగా ఆయుశ్ మాత్రే సీఎస్కేలోకి వచ్చిన విషయం తెలిసిందే.కాగా, సీఎస్కే నిన్న (ఏప్రిల్ 30) పంజాబ్ చేతిలో ఓడటంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు అధికారికంగా గల్లంతయ్యాయి. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించినా.. ఆఖర్లో చహల్ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో 190 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పంజాబ్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
మరో సుడిగాలి శతకం బాదిన ఉర్విల్ పటేల్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ మెరుపు సెంచరీ బాదిన ఉర్విల్.. తాజాగా మరో సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఉత్తరాఖండ్‌తో ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 36 బంతుల్లో శతకొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్.. 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ తరఫున ఇదే అత్యధిక స్కోర్.టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీఉర్విల్ గత నెలాఖరులో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. భారత్ తరఫున టీ20ల్లో ఇది వేగవంతమైన సెంచరీ. ఓవరాల్‌గా టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన శతకం.టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ..భారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్‌ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్‌ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. మెగా వేలంలో ఉర్విల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఉర్విల్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. సమర్థ్ (54), ఆధిత్య తారే (54) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో విశాల్ జేస్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు.183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఉర్విల్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో కేవలం 13.1 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఆర్య దేశాయ్ (23), అక్షర్ పటేల్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో గుజరాత్ ప్రస్తుత ఎడిషన్‌లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో) వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.